International

మేడిన్ చైనా బొమ్మల్లో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్.. భారతీయుల్లారా జాగ్రత్త

మీ పిల్లలు ఏదైనా షాపుకు వెళ్ళినప్పుడు ఓ బొమ్మ కావాలని మారాం చేస్తున్నారా..? మొదట వద్దని చెప్పినా.. ఆ తర్వాత పిల్లలను బాధపెట్టడం ఇష్టం లేక కొనేస్తూ ఉంటారు. అయితే అలా కొనే ముందు కాస్త ఆలోచించండి.. ఆ బొమ్మలు ఎక్కడ తయారయి మన దగ్గరకు వచ్చాయో గుర్తించండి.. చైనాలో ఆ బొమ్మలు తయారయ్యాయని తెలిస్తే మాత్రం దయచేసి తీసుకోకండి..! ఇక్కడ మీరు చదవబోయే విషయం మీకు అత్యంత షాకింగ్ అనిపించొచ్చు.

ఎందుకంటే ఈ మేడిన్ చైనా బొమ్మల్లో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయట..! ఆ బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు ఏళ్ల తరబడి ఆరోపణలు వస్తుండడంతో ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు కూడా విధించాయి. తాజాగా అమెరికా ప్రభుత్వం కూడా చైనాలో తయారైన బొమ్మల విషయంలో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తయారీ బొమ్మలపై జాగ్రత్తగా ఉండాలని, వాటిలో తీవ్ర హానికారక రసాయనాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. అమెరికాలో హాలిడే షాపింగ్ ప్రారంభం కావడానికి ముందు చైనా నుంచి పెద్ద మొత్తంలో దేశంలోకి ఆటవస్తువులు దిగుమతి అయ్యాయి. ప్రజలు బొమ్మలను కొనడానికి ముందుకు వచ్చే సమయంలో చైనా బొమ్మల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బాల్టిమోర్ పోర్టుకు చేరుకున్న ‘లగోరి 7 స్టోన్స్’ ఆట వస్తువులను ఆగస్టు 24న అమెరికా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ప్రయోగశాలకు పంపించి పరీక్షలు నిర్వహించగా, బొమ్మల పైపూతలో సీసం, కాడ్మియం, బేరియం తదితర ప్రమాదకర రసాయనాలు అధికంగా ఉన్నట్టు తేలింది. చైనా నుండి వచ్చిన ఏడు పెట్టెల షిప్‌మెంట్‌లో 295 ప్యాకేజ్‌లు లగోరి 7 స్టోన్స్ ఉన్నాయి.

ఇక్కడ కీలక విషయం.. మనల్ని ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. అమెరికా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న లగోరి 7 స్టోన్స్ ఆట వస్తువులకు భారత్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. పిల్లలు ఇలాంటి పదార్థాలను తాకడం, నోట్లో పెట్టుకోవడం వంటివి చేయడం వలన వారి ఆరోగ్యానికి ఎంతో నష్టాన్ని చేకూర్చుతుంది. భావి తరాల మీద కూడా చైనా బొమ్మలు ప్రభావం చూపుతూ ఉన్నాయి. తక్కువ ధరకే బొమ్మలు దొరుకుతూ ఉన్నాయనే కారణంతో ఇలాంటి బొమ్మలు కొనడం కూడా చాలా ప్రమాదమని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

Related Articles

Back to top button