తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వివాదాల్లో నిలుస్తూ వస్తున్నారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై చీటింగ్ కేసు నమోదు అయింది. సినిమా నిర్మాణం కోసం తన వద్ద రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సినిమా నిర్మిస్తున్నానంటూ బెల్లంకొండ సురేశ్ 2018లో రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మరో సినిమా అంటూ మరోసారి రూ.35 లక్షలు తీసుకున్నాడని శరణ్ ఆరోపించాడు. తన దగ్గర నుంచి మొత్తంగా రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి చెల్లించలేదంటూ శరణ్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం దర్యాప్తు జరపాలని ఆదేశించడంతో పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై బెల్లంకొండ సురేశ్ స్పందించాల్సి ఉంది.
మంచు కుటుంబాన్ని కూడా ఓ వివాదం వెంటాడుతూ ఉంది. మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణును అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నాయీబ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. సేవా సంఘం అధ్యక్షుడు మానుకొండ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రాజోలు తహసీల్దార్ ముక్తేశ్వరరావును కలిసి వినపతిపత్రం అందించారు. రాజమహేంద్రవరానికి చెందిన నాగశ్రీను సినీ నటుడు మోహన్‌బాబు వద్ద దశాబ్దకాలంగా నమ్మకంగా పనిచేస్తున్నాడని, అలాంటి శ్రీనుపై దొంగతనం కేసు పెట్టి, కులం పేరుతో దూషించారని నాయీబ్రాహ్మణుల సేవా సంఘం నాయకులు చెప్పుకొచ్చారు. ఇలాంటివి తగదని వారు అన్నారు మోహన్‌బాబు, మంచు విష్ణు ఆరోపిస్తున్నట్టుగా దొంగతనం జరిగిందో, లేదో దర్యాప్తు జరపాలని అంటున్నారు. హెయిర్ స్టయిలిస్ట్ నాగశ్రీను వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణులపై నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు గత కొద్దిరోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట వారు కర్నూలులోని మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించారని మోహన్ బాబు, హీరో విష్ణుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు కుటుంబం తమ మనోభావాలను దెబ్బ తీసిందని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి నాయీ బ్రాహ్మణ సంఘాలు. ఇటీవల సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా నాగశ్రీనును ఇంట్లో పనివాళ్ల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి దుర్భాషలాడారని ఆరోపించారు. రూ.5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని చోరీ చేశాడని అక్రమ కేసులు బనాయించారన్నారు.