‘హిడ్మా’ ట్రాప్.. ‘U’ ఆకృతిలో దొంగదెబ్బ.. ఊహించని రీతిలో జవానుల వీరమరణాలు.. ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ఏం జరిగింది?

0
717

ఏప్రిల్ 2న సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో కూడిన 2వేల మంది జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రక్తపు టేరులు పారించారు. దండకారణ్యంలో మారణహోమం సృష్టించారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన జవాన్ల సంఖ్య ప్రతి భారతీయుడి మదిని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మారణాయుధాలు వాడినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. లైట్ మెషీన్ గన్స్, అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్, దేశీ రాకెట్స్ ఉపయోగించారని పేర్కొన్నారు. లైట్ మెషీన్ గన్స్ వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని చెప్పారు. మోర్టార్స్‌లతో పాటు బుల్లెట్ల వర్షం కురిపించడంతో మొదట చాలా మంది జవాన్లను గాయపడ్డారు. వారిని మిగతా జవాన్లు ఓ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. వారిపై మరోసారి దేశీ రాకెట్లతో విరుచుకుపడడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. పక్కా ప్రణాళికతోనే భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు దాడి చేసారు. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్‌దీప్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు.

ఏప్రిల్ 2న సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో కూడిన 2వేల మంది జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగింది.

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో అశువులు బాసిన భద్రతా సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు అసువులు బాశారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 7గురు పరిస్థితి విషమం. మరికొందరి ఆచూకీ ఇంకా లభ్యం కాని పరిస్థితి. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు గాలిస్తున్నారు. ఐతే శనివారం బీజాపూర్‌లో జరిగిన ఎదురు కాల్పుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టులు పక్కా ప్లాన్‌తోనే భద్రతా సిబ్బందిని ట్రాప్ చేసి మన జవానులను పొట్టనబెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మావోయిస్ట్ అగ్రనేత, మోస్ట్ వాటెండ్ మడ్వి హిడ్మా.. తారెమ్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఓ పుకారు సృష్టించారు మావోయిస్టులు. అది నిజమని నమ్మి అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. అప్పటికే మాటువేసి ఉన్న మావోయిస్టులు భధ్రతా సిబ్బందిపై మెరుపు దాడి చేశారు.

తారెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఇంగ్లీష్ అక్షరం U ఆకారంలో మోహరించారు. మరోవైపు నుంచి భద్రతా సిబ్బంది రాగానే.. మూడు వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఊహించని ఆ దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది జవాన్లు బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. ఐతే బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఓ జవాన్ చేతులను దారుణంగా నరికేసి.. చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు గాయాల పాలైన జవాన్లలో చాలా మంది బతికేవారు. కానీ ఎక్కువ సేపు ఎదురుకాల్పులు జరగడంతో వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లడం కష్టమయింది. ఎండలతో డీహైడ్రేషన్‌కు గురై పలువురు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన జవాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లాక్కొని మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.

ఈ క్రూరమైన దాడిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హిడ్మా.. ఇంతకీ ఎవరితను?

మడ్వి హిడ్మా..మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత. అతడి స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా పూవర్తి గ్రామం. హిడ్మా వయసు 40 ఏళ్ల వరకు ఉండవచ్చు. 1990ల్లో అతడు మావోయిస్ట్ దళంలో చేరాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ మొదటి బెటాలియన్‌కు హెడ్‌గా ఉన్నాడు. 180 నుంచి 250 మంది మావోయిస్టులకు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. అంతేకాదు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగానూ ఉన్నాడు. హిడ్మా నేతృత్వంలో గతంలో ఎన్నో మావోయిస్టు దాడులు జరిగాయి. ఇతనే ఈ దాడికి సూత్రధారి అనీ, ఇతనే ప్లాన్ వేశాడనే అనుమానాలు కలుగుతున్నాయి. 5 గంటలకు పైగా ఎన్‌కౌంటర్ కొనసాగిందంటే… హిడ్మా ఏ రేంజ్‌లో స్కెచ్ వేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. హిడ్మా… 21 సభ్యుల మావోయిస్టు సెంట్రల్ కమిటీలో సభ్యుడు. ఆ టీమ్‌లో ఇతనే చిన్నవాడు. కొన్నాళ్లుగా హిడ్మా బీజాపూర్ ప్రాంతంలోనే ఉంటున్నాడని నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది. ఇతను ప్లాన్స్ వెయ్యడంలో దిట్ట. సడెన్‌గా దాడులు చేయించడంలో హిడ్మాకి మంచి పట్టుంది. హిడ్మా చాలా డేంజరస్. అతని ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. మన జవానులను చంపాలనే కసి చాలా ఎక్కువ. ఉన్నట్టుండి దాడులు చేయించడంలో హిడ్మా ఆరితేరాడు. చిన్న చిన్న దాడులు చేయించడం హిడ్మాకు నచ్చదు. దాడి జరిగితే… వందల సంఖ్యలో జవాన్లు చనిపోవాలని కోరుకునే రకం. ఇతడు గెరిల్లా దళాలేమైనా నడుపుతున్నాడా అంటే అవునని తెలిసింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్‌ను ఇతనే నడుపుతున్నట్లు సమాచారం ఉంది.

హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డ్ ఉంది. కానీ అతన్ని పట్టుకోవాలంటే ముందు… అతని చుట్టూ ఉన్న సామ్రాజ్యాన్ని కంట్రోల్ చెయ్యాలి. అప్పుడే అది సాధ్యమని నిఘావర్గాలు భావిస్తున్నాయి.

ఐతే ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు చేసిన వీరోచిత పోరాటంలో దొంగదెబ్బ తీసిన ముష్కరులవైపు కూడా చాలా మంది హతులయ్యారు. వివరాలను CRPF డీజీ కుల్దీప్ సింగ్ వెల్లడిచేస్తూ దాదాపు 30 మంది వరకు మరణించిన ఉంటారని..  ఐతే ఖచ్చితంగా  ఎంత మంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆయన బీజాపూర్‌లో పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కుల్దీప్ సింగ్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

”ఇందులో నిఘా వర్గాల వైఫల్యం ఉందనడానికి ఎలాంటి ఆస్కారం లేదు. నిఘా వైఫల్యం ఉంటే భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టే వారే కాదు. భద్రతా దళాల ఆపరేషన్‌లోనూ వైఫల్యం లేదు. ఎందుకంటే ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు కూడా చాలా మంది హతమయ్యారు. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు మావోయిస్టులు మూడు ట్రాక్టర్‌లను ఉపయోగించారు. ఐతే ఖచ్చితంగా ఎంత మంచి చనిపోయారో ఇప్పుడే చెప్పలేం. 25 నుంచి 30 మంది మావోయిస్టులు మట్టికరిచి ఉంటారని” అని డీజీ కుల్దీప్ సింగ్ వెల్లడించారు.

అటు హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై ఆరాతీశారు. ప్రతీకారం తప్పదని మావోయిస్టులను ఆయన హెచ్చరించారు. భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడికి తగిన సమయంలో బదులిస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. భద్రత బలగాల త్యాగాలను వృథా కానిబోవ్వని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యను సహించేది లేదని అన్నారు. అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జవాన్ల మృతిపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక విచారం వ్యక్తం చేశారు. మావోయిస్టులు దుశ్చర్యను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు.

ప్రస్తుతం మన జవాన్లకు ఇదో పరీక్షా సమయం. అసలీ మావోయిస్టుల సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 30 మంది జవాన్లు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు జవాన్ల ఆచూకీ లభించకపోవడం కలవరానికి గురిచేస్తున్న విషయం. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు ఇంకా గాలిస్తున్నాయి… అలాగే మావోయిస్టుల కోసం కూంబింగ్ కూడా కొనసాగుతోంది.

అటు బోర్డర్ లో ఉగ్రవాదులు.. ఇటు అడవుల్లో మావోయిస్టులు.. వీరితో నిత్యం చేస్తున్న పోరాటంలో ఎంతో మంది భరతమాత ముద్దబిడ్డలు.. మన అసలు సిసలు అన్నలయిన జవానుల ఆత్మకు శాంతి కలుగాలని భగవంతున్న ప్రార్థిస్తూ.. జై హింద్

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eight + seventeen =