చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

0
684

ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తూ ఉండడంతో ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో చార్‌ధామ్ యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్త‌రాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి వ‌ర్షాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. రుద్ర‌ప్ర‌యాగ్ అధికారుల‌తో ఆయ‌న చ‌ర్చించారు. కేదార్‌నాథ్ ఆల‌యం వ‌ద్ద ఆదివారం ఆరు వేల మంది భ‌క్తులు ఉన్నార‌ని, వారిలో 4 వేల మంది తిరిగి వ‌చ్చిన‌ట్లు రుద్ర‌ప్ర‌యాగ్ అధికారులు తెలిపారు. మ‌రో రెండు వేల మంది భ‌క్తులు సుర‌క్షిత ప్ర‌దేశంలో ఉన్న‌ట్లు ఆయ‌న సీఎంకు చెప్పారు.

అక్టోబర్ 17-19 వరకు ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ జారీ చేసిన భారీ వర్ష హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చార్ ధామ్ దేవస్థానం బోర్డు కూడా తెలిపింది. ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండవ రోజు సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణం మెరుగుపడే వరకు దేవాలయాలకు వెళ్లవద్దని అధికారులు చార్ ధామ్ యాత్రికులకు సూచించారు. యమునోత్రికి వెళ్లే యాత్రికులు బాద్‌కోట్, జంకిచట్టిలో ఉండాలని కోరారు. గంగోత్రికి వెళ్లేవారు హర్సిల్, భట్వారీ మరియు మానేరిలో ఉండాలని ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ మీడియాకి చెప్పారు. కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్ వెళ్లే యాత్రికులు వాతావరణం అనుకూలించే వరకు తమ ప్రయాణాన్ని కొనసాగించవద్దని కోరారు. బద్రీనాథ్ మార్గంలో చాలా మంది యాత్రికులు జోషిమఠ్, చమోలిలో ఉంటున్నారని చమోలి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్. జోషి అన్నారు. కేదార్‌నాథ్ వెళ్లే 4,000 మంది యాత్రికులను ముందు జాగ్రత్త చర్యగా లించౌలి మరియు భీంబలిలో నిలిపివేసినట్లు రుద్రప్రయాగ్ విపత్తు నిర్వహణ అధికారి ఎన్.ఎస్. సింగ్ తెలిపారు.

హిమాలయ శిఖరాల్లో తేలికపాటి మంచు కురుస్తూ ఉంది. చమోలి జిల్లాలోని దిగువ ప్రాంతాలలో జల్లులు పడుతున్నాయని.. ఉత్తరకాశి మరియు డెహ్రాడూన్‌లో కూడా వర్షం పడుతోందని వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో చాలా విద్యాసంస్థలు సోమవారం మూసివేయబడ్డాయి. నందా దేవి బయోస్పియర్ రిజర్వ్, వివిధ అటవీ విభాగాలతో సహా రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాలలో ట్రెక్కింగ్, పర్వతారోహణ మరియు క్యాంపింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. అక్టోబర్ 17 మరియు 19 మధ్య ఉత్తరాఖండ్‌లోని మొత్తం 13 జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలతో పాటూ.. అధిక వేగంతో కూడా గాలులు (గంటకు 60-70 కిమీ) వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.