దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కోనసీమలో అల్లర్లు: చంద్రబాబు

0
1034

మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేశాడని, ఆ తర్వాత మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చారని.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రమాదంగా చిత్రీకరించారని విమర్శించారు. ఈ హత్యతో ప్రభుత్వంపై దళితుల్లో వ్యతిరేకత వచ్చిందని… దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కోనసీమలో అల్లర్లను సృష్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్, ఇప్పుడు రాష్ట్రంలో నాసి రకం బ్రాండ్లను అమ్ముకుంటూ దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఉందని.. పేదలకు ఇళ్లను కట్టిస్తామని చెప్పారు కానీ, వైసీపీ దోపిడీ వల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి వల్ల రాష్ట్రం దివాళా తీసిందని దుయ్యబట్టారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పిన జగన్… ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ వాళ్లు సొంత ఇళ్లను తగులబెట్టుకుని కొత్త డ్రామాకు తెరలేపారని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని .. ఒక్కసారే కదా అని కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుందని ప్రశ్నించారు. తనకు సీఎం పదవి కొత్త కాదని.. ఎన్నో ఏళ్లు ఆ పదవిలో ఉండే అవకాశాన్ని ప్రజలు తనకు ఇచ్చారని… అయితే, రాష్ట్రం నాశనమయిందనేదే తన ఆవేదన అని అన్నారు.