స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ కస్టడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లబోతున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును ఇచ్చింది. కస్టడీ తేదీలను ఇంకా కోర్టు వెల్లడించలేదు. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది. ఐదు రోజులు కాకుండా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఈ కేసులో మరిన్ని విషయాలు అథ్యయనం చేయాలంటే తమకు కస్టడీకి చంద్రబాబును అప్పగించాలని సీఐడీ తరుపున న్యాయవాదులు వాదించారు. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ కేసు బనాయించారని, కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరుపు న్యాయవాదులు వాదించారు. మొత్తం మీద ఏసీబీ కోర్టు మాత్రం సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయనను అధికారులు విచారించనున్నారు.
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై తీర్పు వెలువడింది. చంద్రబాబుకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. సీఐడీ వాదనను సమర్థించింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో తనపై నమోదయిన కేసులన్నీ కొట్టి వేయాలని చంద్రబాబు వేసిన పిటీషన్ పై 2వాదనలు జరిగాయి. చంద్రబాబుకు తెలిసే కుంభకోణం జరిగిందని సీఐడీ తరుపున న్యాయవాదులు తెలిపారు.