చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 9న దీనిపై విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై వాడీవేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు అభిషేక్ సింఘ్వి, హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరపున ముకల్ రోహత్గీ.. వాదనలు వినిపించారు. బాబు క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ముఖ్యంగా 17A చుట్టూ వాదనలు కొనసాగాయి. 17A వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు వాదించగా.. వర్తించదని సీఐడీ తరపున లాయర్లు వాదించారు. కీలక వాదనల అనంతరం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ తీర్పును వాయిదా వేసింది.
సీఐడీ తరపున లాయర్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు 17A వర్తించదని, క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని అన్నారు. 2018లో సెక్షన్ 17A అమల్లోకి వచ్చిందని, వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని ధర్మాసనానికి లాయర్ రోహత్గీ వివరించారు. ఈ కేసుకి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
ఇక అంగళ్లు ఘటనలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అంగళ్లు ఘటనలో నిందితులకు రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంగళ్లులో చోటు చేసుకున్న ఘటనలో పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో తెలిపింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో దేవినేని ఉమా, చల్లా బాబుతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ దశలో ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది.