టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ బుధవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఓ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా జరిగిన నష్టం, డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గల కారణాలు, ప్రాజెక్టుపై వైసీపీ వైఖరి తదితరాలను సదరు లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టుకు నష్టం జరుగుతోందని.. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరుగుతోందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సాంకేతికంగా నష్టం జరిగిందని.. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం పట్ల వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు తొందరగా పూర్తవ్వడానికి సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులు మధ్యలో నిలిచిపోయిన కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం మరో కంపెనీకి అప్పగించిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆకస్మికంగా పనుల నిలిపివేతతో కొత్త ఏజెన్సీ పనులకు 6 నెలల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు.