వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. అడాన్ కంపెనీతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తగిన ఆధారాలతో ఈ దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టే సామర్థ్యం తనకు ఉందన్నారు. ఇప్పటిదాకా నారా, నందమూరి కుటుంబాల గురించి తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదన్న ఆయన పరిధి దాటొద్దని చంద్రబాబు, లోకేశ్ లను హెచ్చరించారు. అసభ్య పదజాలాన్ని వాడాలంటే వారిద్దరికంటే తాను పదింతలు ఎక్కువ ఉపయోగించాల్సి ఉందన్నారు.
క్రూయిజ్ కంపెనీ తన కుమార్తెదంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆ కంపెనీ నిజంగా మాదే అయితే దాన్ని చంద్రబాబుకే ఫ్రీగా రాసిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంత పచ్చి అబద్దాలకోరు అన్నది ఆయన చేసే ఆరోపణలను బట్టి అర్థమవుతుందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అడాన్ కంపెనీ తమ కుటుంబానికి చెందిందంటూ చంద్రబాబు, టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని సాయిరెడ్డి మండిపడ్డారు. ఇతర కంపెనీల్లో కామన్ డైరెక్టర్లుగా ఉన్నంత మాత్రాన ఆ కంపెనీలు తమ కుటుంబానికి చెందినవిగా దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. చంద్రబాబు హయాంలో 20 మద్యం డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చారన్న సాయిరెడ్డి… 254 కొత్త బ్రాండులకు అనుమతులు కూడా చంద్రబాబే ఇచ్చారన్నారు.