ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరం లో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలలో భాగంగా భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. 15 టన్నుల బరువున్న ఈ కాంస్య విగ్రహాన్ని పట్టణంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్ నగర్‌లోని మునిసిపల్ పార్కులో ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి టీడీపీ నుంచి ప్రతినిధిని పంపాలని కోరారు. ఆహ్వాన లేఖ రాయడంతో పాటు చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ తరుపున ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.