చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు..!

0
131

ఏమీ లేని స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టులో తప్పుడు కేసుపెట్టి చంద్రబాబు నాయుడును అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నా రాష్ట్రం ఏమైపోతుందోనన్న బాధలోనే ఉన్నారని.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు. రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ ఏ తప్పూ చేయని నేతను తప్పు చేసినట్లు సృష్టించి తప్పుడు కేసులు బనాయించారన్నారు. రాష్ట్రాన్ని దోచిన వాళ్లే చంద్రబాబు తప్పు చేశారని చెబుతున్నారని.. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని అన్నారు. మచ్చలేని వ్యక్తిని జైల్లో పెడితే బాధపడకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధించి, హింసిస్తోందని.. ప్రజలు గుర్తించారన్నారు. ప్రజలు, కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారన్నారు యనమల. రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు ధ్వంసం చేస్తుంటే చంద్రబాబు సంతోషంగా ఎలా ఉంటారని.. పథకాల పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు యనమల. రాష్ట్రభవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. జైలులో కనీస సదుపాయాలు లేవని.. తన సౌకర్యాల గురించి చంద్రబాబు బాధపడటం లేదన్నారు. ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రికి పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఆయనకు నిబంధనల ప్రకారం సౌకర్యాలు ఉన్నాయని, కోర్టు గైడెన్స్ ప్రకారం ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచినట్లు చెప్పారు. తానూ చట్టప్రకారమే పని చేస్తున్నానని, తనపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని కోరారు. నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు ఉంటాయన్నారు. వారానికి రెండు ములాఖత్‌లు ఉంటాయని, అత్యవసరమైతే మరో ములాఖత్‌పై జైలు అధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ కు చేరుకుని ఎంపీలతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు.