తమ న్యూస్ ప్లాట్‌ఫారాలపై ప్రచురిస్తున్న వార్తలకు టెక్ దిగ్గజాలు భారతీయ పబ్లిషర్లకు డబ్బులు చెల్లించాల్సిందే. వేర్వేరు పబ్లిషర్ల వార్తలను వాడుకుంటున్న గూగుల్ న్యూస్, యూట్యూబ్, ఫేసబుక్, ఇన్‌స్టా, వాట్సాప్ సంస్థల్లోని వార్తల ఛానళ్లకు మరింత గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
తమకు న్యూస్ కేటగిరీ ద్వారా వస్తున్న రెవెన్యూను భారతీయ పబ్లిషర్లతో పంచుకునేలా ఐటీ చట్టాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పబ్లిషర్లకు మేలు కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ట్విటర్, అమెజాన్ లాంటి సంస్థలు కూడా తమ వెబ్‌సైట్లలో వార్తలను ప్రచురిస్తున్నందుకు ఆయా వార్తల అసలు హక్కుదారులైన పబ్లిషర్లకు రెవెన్యూను షేర్ చేసేలా ఈ చట్టంలో మార్పులు తేనుంది.
కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లోనూ ఇప్పటికే ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా.. 155 ఏళ్ల నాటి భారత ప్రెస్, పత్రికల రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో 1867 నాటి బిల్లుకు సవరణలు చేయనుంది. ఈ సవరణలతో చిన్న, మధ్యతరహా పత్రికల లబ్ధి చేకూరుతుందని తెలుస్తోంది. 2017లోనే ఈ సవరణల ముసాయిదాను విడుదల చేశారు.
ఇందులో డిజిటల్ మీడియా రిజిస్ట్రేషన్లనూ చేర్చారు. 2019లో ఈ సవరణ ముసాయిదాను ‘న్యూస్ ఆన్ డిజిటల్ మీడియా’గా మార్చారు. కాగా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎ్‌సఐ)ను మరింత బలోపేతం చేసేలా పురావస్తు శాఖ ప్రదేశాలు, సవరణ బిల్లు-2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందు కు కేంద్రం కసరత్తు చేస్తోంది. నిషేధిత ప్రదేశాల వద్ద నిర్మాణాలపై ఉన్న నిషేధంలో మార్పులు, ఆయా కట్టడాల హేతుబద్దీకరణతో పాటు అటవీ చట్టం సవరణతో ఆ శాఖకు అధికారాలిచ్చినట్లు పలు సవరణలతో ఏఎస్ఐని బలోపేతం చేస్తారు.