రాజీవ్ హంతకుల విడుదలపై.. కేంద్రం సంచలన నిర్ణయం..!

0
736

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించుకుంది. ఎల్టీటీఈ తీవ్రవాదులు నళినీ శ్రీహరన్ తో పాటు మిగిలిన ఐదుగురు నిందితులను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అసాధారణమైన అధికారాలను ఉపయోగిస్తూ తీసుకున్న నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వ సూచనలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపింది. అందుకే ఈ కేసును మరోసారి పున: పరిశీలించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

1991 మే 21 న నాటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉండగా.. శ్రీపెరంబుదూరు సభలో ఆత్మాహుతి దాడి జరిగింది. ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈలం’ అనే తమిళ వేర్పాటు వాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఆత్మాహుతి దాడిలో ఆత్మాహుతి బాంబర్ తెన్మోజీ రాజారత్నం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పాటు మరో పద్నాలుగు మంది మృతి చెందారు. ఈ దాడితో యావత్ భారత దేశం ఉలిక్కి పడింది. ఈ కేసులో నళినీ శ్రీహరన్ తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి నిందితులందరూ దాదాపు 30 ఏళ్ళుగా జైలు జీవితాన్ని గడిపారు. అయితే ఈ కేసులో కొద్ది నెలల క్రితం ఏజీ పెరారివలన్‎ను కోర్టు జైలు నుంచి విడుదల చేసినా,.. నళినీ శ్రీధరన్ తో పాటుగా మరికొంతమంది నిందితులను విడుదల చేయలేదు.

కొద్దిరోజుల క్రితం సుప్రీం కోర్టు మిగిలిన దోషులను కూడా విడుదల చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దోషులందరూ దాదాపు ముప్పైఏళ్ళ వరకు కారాగార శిక్షను అనుభవించారనీ,.. నిందితులందరూ జైల్లో సత్ర్పవర్తనతో మెలుగుతున్నారనీ,.. విడుదల చేయడానికి నిర్ణయించుకుంది. అందుకే కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకుని విడుదల చేసింది. గతంలో ఏజీ పెరారివలన్ ను విడుదల చేసినప్పటి వాదనలు మిగిలిన నిందితులకు కూడా వర్తిస్తుందని కోర్టు భావించింది. అంతేకాదు, తమిళనాడు ప్రభుత్వం గతంలో చేసిన సిఫార్సును కూడా పరిగణలోకి తీసుకుంటూ నిందితులందరినీ విడుదల చేస్తున్నట్లు తీర్పునిచ్చింది. అయితే నిందితులను విడుదల చేయడంపై పలువురిలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఏకంగా భారత మాజీ ప్రధానినే చంపడమంటే ఇది ఏమాత్రమూ క్షమించరాని నేరమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిందితులంతా గతంలో తీవ్రవాద సంస్థల్లో పనిచేసిన వ్యక్తులు కాబట్టి వారి భావజాలం ఇప్పటికీ అలాగే ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిని బయటకు వదిలితే నాటి ఎల్టీటీఈ మూలాలు మళ్ళీ ఉత్తేజితమయ్యే అవకాశమూ లేకపోలేదని పలువురు హెచ్చరిస్తున్నారు. అయితే కారణమేదైనప్పటికీ,.. ఈ విడుదలన సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సాధారణంగా సుప్రీం కోర్టు నిందితులను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సూచనలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో మాత్రం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ సూచనను పరిగణలోకి తీసుకోకుండా ఆర్టికల్ 142 అధికారాన్ని వినియోగించుకుంది. దీంతో ఇది రాజ్యాంగ విరుద్దమంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం కోర్టు ఈ రివ్యూ పిటిషన్ స్వీకరించి మరోసారి వాదనలను వింటుందా, లేక ఇక్కడితో ఈ కేసును ముగిస్తుందా అనే దానిపై సర్వత్రా సందిగ్దం నెలకొంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =