శ్రీలంకలో కొనసాగుతున్న పరిస్థితులపై కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజైన జూలై 19న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఆదివారం వివిధ రాజకీయ పార్టీల నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ, “శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభంపై ఈఏఎం డాక్టర్ ఎస్ జైశంకర్, ఎఫ్‌ఎం సీతారామన్ నేతృత్వంలో ప్రభుత్వం మంగళవారం మరో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.” అని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఏఐఏడీఎంకే నేత ఎం తంబి దురై, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు మాట్లాడుతూ శ్రీలంకలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని అన్నారు.
శ్రీలంకకు సహాయం చేయడంలో భారత్ చాలా ముందు ఉంది. అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున శ్రీలంకకు ఇంధనం, రేషన్ సరఫరాలో భారత్ సహాయం చేస్తోంది. గత వారం, శ్రీలంక కోసం భారతదేశం 3.8 బిలియన్ డాలర్లు ఇచ్చిందని జైశంకర్ చెప్పారు. శ్రీలంక రైతులకు సహాయం చేయడానికి భారతదేశం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను కూడా అందజేసింది.