More

    ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ బ్లాక్‌.. ఆ ట్వీట్లపై కూడా

    ప్రధాని నరేంద్ర మోదీపై కొన్ని దేశాల మీడియా సంస్థలు కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే..! అందులో భాగంగానే బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీబీసీ ఉద్దేశపూర్వకంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించిందని భావిస్తోంది కేంద్రం. బీబీసీ గుజరాత్ అల్లర్లపై తీసిన డాక్యుమెంటరీ ఒక ప్రాపగాండ అని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై బురదజల్లే యత్నం అని.. ఆయనకు అపకీర్తిని తెచ్చి పెట్టే విధంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించారని తెలిపింది. ఈ డాక్యుమెంటరీ వాస్తవ పరిస్థితులను కాకుండా దుష్ప్రచారాన్ని చేయాలని తీసినట్లు ఉందని కేంద్రం అభిప్రాయపడింది. అసలు ఈ డాక్యుమెంటరీ వెనుక ఉన్న అజెండా, ఈ మూవీ తీయాల్సిన ఆవశ్యకతల గురించి ఆలోచించినా ఆశ్చర్యం అనిపిస్తుందని.. ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ లో స్వాగతించారని కేంద్రం స్పష్టం చేసింది.

    ఈ వీడియో లింక్లను కొందరు కావాలనే షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ లింక్ లు కనిపించనివ్వకుండా చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియోలు, ట్వీట్లు, వార్తలు తీసేయాలని కేంద్రం సోషల్ మీడియా దిగ్గజాలను ఆదేశించింది. బీబీసీ ద్వారా డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్‌ను బ్లాక్ చేయమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా దిగ్గజాలకు చెప్పింది. BBC డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్‌ను ప్రచురించే అనేక యూట్యూబ్ వీడియోలను నిరోధించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. యూట్యూబ్ వీడియో లింక్‌లకు సంబంధించిన 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్‌లో మళ్లీ వీడియోను అప్‌లోడ్ చేయడాన్ని నిరోధించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వీడియోకు లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్‌లను గుర్తించి బ్లాక్ చేయమని ట్విట్టర్‌కు సూచించింది.

    Trending Stories

    Related Stories