భారతదేశానికి వ్యతిరేకంగా ఎంతో మంది.. ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతూ వస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా భారత్ ను బద్నాం చేస్తున్న వ్యక్తులు ఎంతో మంది.. ఎన్నో విధాలుగా భారత్ పై వ్యతిరేకతను సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేస్తున్న విష ప్రచారాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిషేధం విధిస్తూ వెళుతోంది. ఆ యూట్యూబ్ ఛానల్స్ భారత్ లో ప్రసారం అవ్వకుండా.. వీడియోలను డిలీట్ చేయిస్తూ ఉంది భారత సమాచార మంత్రిత్వ శాఖ. తాజాగా దేశ వ్యతిరేక కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఎనిమిది యూ ట్యూబ్ న్యూస్ చానళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందులో ఒకటి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోంది. భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, శాంతి భద్రతలకు వ్యతిరేకంగా సమాచారాన్ని ఇవి వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. బ్లాక్ చేసిన యూట్యూబ్ చానళ్లకు 114 కోట్ల వ్యూస్ ఉన్నాయి. వీటికి 85.77 లక్షల మంది సబ్ స్క్రయిబర్లుగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు-2021 కింద వీటిని బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన ఎనిమిదింటిలో ఏడు న్యూస్ చానళ్లు ఉన్నాయి.
బ్లాక్ చేయబడిన YouTube ఛానెల్‌లలో Loktantra Tv (12.90 లక్షల మంది సభ్యులు), U&V TV (10.20 లక్షల మంది సభ్యులు), AM రజ్వీ (95, 900 మంది సభ్యులు), గౌరవశాలి పవన్ మిథిలాంచల్ (7 లక్షల మంది సభ్యులు), సర్కారీ అప్‌డేట్ (80,900 మంది సభ్యులు), దేఖో (19.40 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు) ఉన్నాయి. ఇక పాకిస్తాన్ ఆధారిత ఛానెల్ న్యూస్ కి దునియాకు 97,000 మంది సభ్యులు ఉన్నారు. మతపరమైన కట్టడాలను భారత ప్రభుత్వం కూల్చివేసిందని, మత వేడుకల నిర్వహణపై నిషేధం విధించిందని, మతపరమైన యుద్ధాన్ని ప్రకటించిందని ఇలా రకరకాలుగా భారత వ్యతిరేక కంటెంట్ ను ఇవి ప్రసారం చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకారం, ఈ యూట్యూబ్ ఛానెల్‌లలోని కంటెంట్ యొక్క ఉద్దేశ్యం భారతదేశంలోని మత ద్వేషాన్ని వ్యాప్తి చేయడం. “బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్‌ల వివిధ వీడియోలలో తప్పుడు వార్తలు ప్రచారం చేయబడ్డాయి. మతపరమైన నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించడం వంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేశారు.” అని ప్రకటన పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో భారత సాయుధ బలగాలకు సంబందించి నకిలీ వార్తలను ప్రసారం చేసినట్టు తెలిసింది. ఈ తరహా కంటెంట్ మత సామరస్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజా జీవనానికి భంగం కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. బ్లాక్ చేయబడిన భారతీయ యూట్యూబ్ ఛానెల్‌లు వీక్షకులను తప్పుదారి పట్టించేందుకు నకిలీ, సంచలనాత్మక థంబ్ నైల్స్ ను వినియోగించాయి. ప్రముఖ న్యూస్ యాంకర్ల చిత్రాలు, కొన్ని టీవీ న్యూస్ ఛానెల్‌ల లోగోలను ఉపయోగిస్తున్నట్లు గమనించారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ వార్తల్లో ప్రామాణికత లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.