More

    ఆ 35 వాట్సప్ గ్రూప్‎లే అసలు కారణం..! కేంద్రం కన్నెర్ర..!!

    ప్రస్తుతం దేశమంతా అగ్నిపథ్ అంశంపైనే చర్చ జరుగుతుంది. ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.

    ఈ విధానానికి కొంతమంది మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అగ్నిపథ్ నిరసనల నేపధ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింసాత్మక సంఘటనలు జరిగాయి.

    ఈ అల్లర్లకు ప్రధాన కారణం వాట్సాప్ అని వాదనలు వినిపించాయి. నరసరావుపేటకు చెందిన సుబ్బారావు అనే ఇన్స్టిట్యూట్ యజమాని హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నిరుద్యోగులను నిరసనలో పాల్గొన్నంటూ ప్రేరేపించినట్లు పోలీసుల విచారణలో తేలింది ఈ నేపథ్యంలో ఇలాంటి వాట్సప్ గ్రూప్ లపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా తాజాగా కొన్ని వాట్స్అప్ గ్రూపులను నిషేధించింది. అగ్నిపథ్ వ్యతిరేక అల్లర్లకు ప్రధాన ఆయుధంగా అనుమానిస్తున్న 35 వాట్సప్ గ్రూపులపై నిషేధం విధించారు. అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, హింసను ప్రేరేపించడంలో పాల్గొన్న వ్యక్తులను ప్రభుత్వం గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

    ఇదిలా ఉండగా, రక్షణ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టి కొత్త స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ పాలసీ అగ్నిపథ్‌పై సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ , ప్రభుత్వ రైల్వే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.ఎక్కడ అల్లర్లు చెలరేగినా కఠినంగా వ్యవహరించాలని ఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు అన్ని యూనిట్లకు అంతర్గత కమ్యూనికేషన్ ప్రకటనను విడుదల చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని కఠినమైన సెక్షన్ల కింద అల్లర్లకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ పరికరాలు, సీసీటీవీల ద్వారా అల్లర్లు జరిగితే.. దానికి సంబంధించి డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని పోలీసులకు తెలిపారు.

    వీడియో సాక్ష్యాధారాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుంటారు. పరిస్థితి అదుపు తప్పితే పోలీసు అధికారులు సరైన రక్షణ కవచాలు ధరించాలని, ముందుండి వారిని అదుపు చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. బీహార్‌లోని 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ జిల్లాల్లో కైమూర్, భోజ్‌పూర్, ఔరంగాబాద్, రోహతాస్, బక్సర్, నవాడా, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సమస్తిపూర్, లఖిసరాయ్, బెగుసరాయ్, వైశాలి, సరన్, ముజఫర్‌పూర్, దర్భంగా, గయా, మధుబని, జెహానాబాద్, ఖగారియా, షేక్‌పురా ఉన్నాయి.

    భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో పంజాబ్ లో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పంజాబ్‌లోని అన్ని సైనిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. వాటి చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ పోలీస్ ఏడీజీపీ కోరారు. అంతేకాదు అల్లర్లలో వీటికి ఎలాంటి హాని కలగకుండా రక్షించేందుకు ఆర్మీ అధికారులతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కూడా కోరారు.

    Related Stories