అవార్డు ఇచ్చింది మిషన్ భగీరథ కు కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్లు

0
851

వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదన్నారు. రాజకీయాల కోసమే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తనను తిడుతున్నారని కేసీఆర్ అన్నారు. కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు.. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. కేంద్రమంత్రులు తిట్టిపోయిన మర్నాడే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో తాను చెప్పిన‌వ‌న్నీ ఇవాళ సాకారం అయ్యాయన్నారు.

అయితే అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా అధికారికంగా ప్రకటన విడుదల చేయించారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని.. తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదిక ఇచ్చిందని కానీ.. కేంద్రం ధృవీకరించలేదన్నారు. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలి. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణకు అవార్డుకు ఎంపికైందని తన వివరణలో జలశక్తి శాఖ తెలిపింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబరు 2న తెలంగాణకు అవార్డును బహూకరిస్తున్నారని అసలు కారణాన్ని కేంద్రం బయటపెట్టింది.