బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ తదితరులు అమిత్ షాకు స్వాగతం పలికారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి సికింద్రాబాద్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని వెళ్లిన అమిత్ షా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మునుగోడులో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
మునుగోడు సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాత్రి 8 గంటలకు నోవాటెల్ హోటల్ లో పార్టీకి చెందిన పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీకి రావాలని షా నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చిందని తెలుస్తోంది. అమిత్ షాను కలవడానికి తారక్ హోటల్ కు వెళ్లబోతున్నారని సమచారం. దాదాపు 15 నిమిషాలు ఎన్టీఆర్ తో షా భేటీ అవుతారని తెలుస్తోంది.