దాణా కుంభకోణం కేసులో బెయిల్ పొందిన కొన్ని వారాల వ్యవధిలోనే బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహిస్తోంది.
ఆయన బీహార్ సీఎంగా ఉన్న సమయంలో రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ ఆయనపై తాజాగా అభియోగాలు మోపింది. ఈ కేసులోనే ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కొత్త కేసులో సీబీఐ నిందితులుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఈరోజు రాష్ట్రీయ జనతాదళ్ అధినాయకుడికి సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు ప్రారంభించింది. ఇందులో ఆయన నివాసం కూడా ఉంది.
సీబీఐ సిబ్బంది శుక్రవారం ఉదయాన్నే లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతీ నివాసాలతోపాటు ఢిల్లీ, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో 17 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.. ఈ కేసు ప్రాథమిక విచారణలో అవినీతి జరిగినట్లు తేలడంతో సీబీఐ దాడులు నిర్వహిస్తోందని వెల్లడించారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థుల నుంచి భూములు రాయించుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.
రూ. 139 కోట్ల డోరాండా ట్రెజరీ కుంభకోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గత నెలలో జైలు నుండి బయటకు వచ్చారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 60 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ట్రెజరీ కుంభకోణం కేసు లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన ఐదో కేసు.