అవినీతి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ గీతా రావత్‌ను సీబీఐ అవినీతి నిరోధక శాఖ శుక్రవారం అరెస్టు చేసింది. తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ ఒక వ్యక్తి నుండి లంచం కింద రూ. 20,000 డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి బిల్డింగ్ పైకప్పు నిర్మాణానికి ఆమోదం తెలిపేందుకు ఆప్ నాయకురాలు రూ.20వేలు లంచం డిమాండ్ చేయడంతో ఆ వ్యక్తి సీబీఐని ఆశ్రయించారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలతో చేధించేందుకు సీబీఐ అతడితో కలిసి ప్లాన్ ను అమలు చేసింది.
వేరుశెనగలు విక్రయించే సనావుల్లా అనే వ్యాపారి ద్వారా రావత్‌కు లంచం వచ్చింది. కౌన్సిలర్ కార్యాలయం ముందు సనావుల్లా తన వేరుశెనగ దుకాణం పెట్టాడు, గీతా రావత్‌కు లంచం ఇవ్వాల్సిన వారు అతడి దగ్గర డబ్బు ఇవ్వమని కోరేవారు. ట్రాప్‌లో భాగంగా, మారువేషంలో ఉన్న అధికారులు సనావుల్లాకు కొంత డబ్బు ఇచ్చి తమకు ‘ఫేవర్’ చేయమని అడిగారు. పార్శిల్‌ను డెలివరీ చేసేందుకు సనావుల్లా రావత్ కార్యాలయానికి వెళ్లగా, సీబీఐ అధికారులు అతడిని పట్టుకుని, ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. సీబీఐ సనావుల్లాకు ఇచ్చిన నోట్లకు ప్రత్యేక రంగును ఉంచింది. గీతా రావత్ కార్యాలయంలో సోదా చేసినప్పుడు, వారు అవే నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులిద్దరినీ ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.
దీంతో బీజేపీ నేతలు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. రావత్ లంచం తీసుకుంటూ ఉండగా అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. దీనిపై కేజ్రీవాల్ ఎటువంటి సమాధానం చెబుతారోనని ప్రశ్నిస్తూ ఉన్నారు. బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఈ ఘటన పై ఆప్ ప్రభుత్వాన్ని విమర్శించారు. “ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిరోజూ బీజేపీ కౌన్సిలర్లపై అవినీతి ఆరోపణలు చేస్తుంది. కానీ ఈరోజు ఆప్ బండారం బట్టబయలైంది’’ అని కౌంటర్ వేస్తూ.. సీఎం కేజ్రీవాల్, డీసీఎం మనీష్ సిసోడియా సమాధానాలు చెప్పాల్సిందిగా అడిగారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గతంలో బీజేపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. 2021లో ఢిల్లీలోని మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు AAP నాయకులు BJP, ఇతర రాజకీయ పార్టీలను అవినీతిపరులుగా అభివర్ణించింది. గీతా రావత్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీసీఎం మనీష్ సిసోడియాల దగ్గర పలుకుబడి ఉన్నవారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ ఘటన రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరి అరెస్టులతో సీబీఐ విచారణ కొనసాగుతోంది.