ఓ దేశభక్తుడిని దేశద్రోహిగా చిత్రీకరించారు

0
675

ఇస్రో మాజీ శాస్త్రవేత్త, పద్మభూషణ్ నంబి నారాయణన్‎పై నకిలీ గూఢచర్యం కేసు మోపి ఇబ్బందులకు గురిచేసిన కేసులో.. కుట్రలు ఒక్కక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ దేశభక్తుడిని దేశద్రోహిగా చిత్రీకరించిన.. 1994 నాటి ఈ కేసులో.. సీబీఐ నిజానిజాల్ని నిగ్గుతేలుస్తోంది. నంబినారాయణన్‎ను అక్రమంగా అరెస్ట్ చేసిన నాటి సిట్ సభ్యులు, మాజీ ఐపీఎస్ అధికారులు.. ఎస్. విజయన్, థంపి ఎస్. దుర్గాదత్‎లపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా.. వారికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ.. కేరళ హైకోర్టుకు విన్నవించుకుంది. సదరు ఇద్దరు అధికారులు నాడు నంబి నారాయణన్‎ను నిర్బంధ కేసులో ఇరికించి దేశద్రోహిగా చిత్రీకరించారు. తద్వారా.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా.. భారత్ సొంత క్రయోజినిక్ సాంకేతిక పరిజ్ఙానం అభివృద్ధిలో ఆలస్యానికి కారకులయ్యారు. పరోక్షంగా దేశాభివృద్ధిని అడ్డుకున్నారు.

ఇద్దరు నిందితులపై నేరారోపణలు తీవ్రంగా వున్నాయని.. సీబీఐ.. కేరళ హైకోర్టుకు తెలిపింది. ఎఫ్ఐఆర్‎లో పేర్కొన్న ఇతర వ్యక్తులతో కలిసి.. నంబి నారాయణన్‎కు వ్యతిరేకంగా కుట్ర పన్నడంలో.. మాజీ ఐపీఎస్ అధికారులిద్దరూ చురుకైన పాత్ర పోషించినట్టు.. సీబీఐ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు. నంబి నారాయణన్‎పై తప్పుడు ఆరోపణలు చేసి.. అరెస్ట్ చేయడం వల్ల క్రయోజెనిక సాంకేతిక పరిజ్ఙానం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. తద్వారా అంతరిక్ష పరిజ్ఞానంలో భారత్ ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లింది.

నంబి నారాయణన్‎ అరెస్ట్‎కు దారితీసిన పరిణామాలపై సీబీఐ ప్యానెల్ రెండున్నరేళ్లుగా అధ్యయనం చేసింది. అదే సమయంలో, ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ డి. శశికుమరన్ తో పాటు.. మరియం రషీదా స్నేహితురాలు, మాల్దీవులకు ఫౌసియా హసన్ కూడా అరెస్టు అయ్యారు. అటు, ఇస్రో శాస్త్రవేత్తపై కేరళ పోలీసులు తీసుకున్న చర్యలను ‘సైకో పాథాలజికల్ ట్రీట్మెంట్’గా కోర్టు అభివర్ణించింది. ప్రస్తుతం నారాయణన్ అక్రమ అరెస్ట్‎కు కారణమైన కేరళలోని ఇంటలిజెన్స్ అధికారులతో పాటు.. మరో 16 మంది ఉన్నతాధికారులను కూడా సీబీఐ విచారిస్తోంది. నిందితులంతా.. భారతీయ శిక్షాస్మృతిలోని నేరపూరిత కుట్ర, కిడ్నాప్, కల్పిత సాక్ష్యాలను సృష్టించడం వంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిందితులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. వారు దర్యాప్తునకు సహకరించని.. దీనివల్ల దర్యాప్తు వేగం ప్రభావం చూపుతుందని సీబీఐ తాజా కోర్టుకు విన్నవించింది.

ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‎పై పెట్టిన దేశద్రోహం కేసుపై.. రెండు దశాబ్దాలుగా విచారణ సాగుతోంది. ఈ కేసు అప్పట్లో రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం.. నాటి కేరళ సీఎం, దివంగత కె. కరుణాకరన్ లక్ష్యంగా చేసుకుంది. దీంతో చివరకు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఇదిలావుంటే, నంబి నారాయణన్ అక్రమ అరెస్ట్ వెనుక అంతర్జాతీయ కుట్ర బట్టబయలైంది. ఓ దేశభక్తుడిని దేశద్రోహిగా మార్చిన కుతంత్రం గురించి తెలుసుకోవాలంటే, 1990వ దశకానికి వెళ్లాల్సిందే.

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.. క్రయోజనిక్ సాంకేతికత కోసం పరితపిస్తున్న రోజులవి. ఇస్రో వద్ద క్రయోజనిక్ లేకపోవడంతో.. భారీ రాకెట్లను ప్రయోగించాలంటే.. ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది. ముఖ్యంగా జీఎస్ఎల్వీ రాకెట్లను పంపాలంటే ఫ్రెంచ్ గయానాపై ఎక్కువగా ఆధారపడేది ఇస్రో. అందుకే, ఎలాగైనా క్రయోజనిక్ టెక్నాలజీని సంపాదించాలని భారత్ అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించింది. 250 మిలియన్ డాలర్లకు రష్యా అంతరిక్ష సంస్థ గ్లౌకాస్మోస్ నుంచి క్రయోజనిక్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధపడింది. అయితే, భారత్ కు ఈ టెక్నాలజీ అందితే.. అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కడ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందోనని భావించిన అమెరికా.. భారత్-రష్యా ఒప్పందానికి సైంధవుడిలా అడ్డుపడింది.

రష్యా నుంచి రెండు క్రయోజనిక్ ఇంజన్లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించిన వెంటనే.. అమెరికా కుట్రలకు తెరతీసింది. నాడు అమెరికా సెనేటర్ గా వున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. ఈ కుట్ర సిద్ధాంతానికి కర్మ, కర్త అనే వాదన వుంది. భారత్‎కు క్రయోజనిక్ ఇంజన్లు అమ్మితే.. రష్యా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని.. అందువల్ల అలాంటి పని చేయకపోవచ్చని భావిస్తున్నట్టు.. ఓ సందర్భంలో బైడెన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, దీనిని ఓ ప్రమాదకరమైన ఒప్పందంగా అభివర్ణించాడు. రాజకీయ దురుద్దేశంతో నాడు డెమొక్రాట్లు ఆడిన నాటకమిది. నాడు పాకిస్తాన్‎కు అండగా వున్న అమెరికా.. భారత్‎లో అంతరిక్ష కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర.

అయితే, భారత్ పదే పదే ఒత్తిడి తీసుకురావడంతో.. భారత్‎కు రష్యా ఏడు క్రయోజనిక్ ఇంజన్లను సరఫరా చేసేందుకు అమెరికా అంగీకరించింది. కానీ, క్రయోజనిక్ టెక్నాలజీ బదిలీకి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో భారత అంతరిక్ష వ్యవస్థ బలహీనపడింది. ఈ నేపథ్యంలో క్రయోజనిక్ సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. చిన్నచిన్న ఉపగ్రహాలనైతే పీఎస్ఎల్వీ వాహకనౌక ద్వారా అంతరిక్షంలోకి పంపవచ్చు. కానీ, భారీ ఉపగ్రహాలను ఎక్కువ దూరాలకు తీసుకెళ్లడానికి.. రాకెట్‌కు అవసరమైన అదనపు శక్తి అవసరం. ఇందుకోసం ఇంధనాన్ని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిర్వహించాల్సి వుంటుంది. ఇది క్రయోజనిక్ సాంకేతిక వల్లనే సాధ్యమవుతుంది. అందుకే, భారత్‎కు ఆ సాంకేతికత అందకుండా బైడన్ అడ్డుపడ్డాడు. 1992లో బైడెన్ మోసపూరిత మనస్తత్వం వల్ల భారత అంతరిక్ష కార్యక్రమాలు కొన్నేళ్లపాటు వాయిదావేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంతేకాదు, దేశానికి సొంతంగా క్రయోజనిక్ టెక్నాలజీని అందివ్వాలని కలలుగన్న.. నంబి నారాయణన్‎ను అడ్డుకోవడం ద్వారా.. ఇస్రో ఎదగకుండా అమెరికా కుట్ర పన్నిందనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే.. చేయని నేరానికి నంబి నారాయణన్ పై దేశద్రోహిగా ఆపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. రక్షణ రంగ నిపుణులు చెబుతారు.

1994లో మాల్దీవులకు చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులైన.. మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్‌ లకు.. ఫ్లైట్ టెస్ట్ డేటా, రాకెట్, ఉపగ్రహ ప్రయోగాల వివరాలను అమ్ముకున్నారని ఆరోపిస్తూ.. నాడు క్రయోజెనిక్స్ శాఖకు ఇంఛార్జ్‌గా వున్న సైంటిస్ట్ నంబి నారాయణన్‎తో పాటు.. మరో శాస్త్రవేత్త శశికుమరన్‌‌లపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్‌‌లతోపాటు వారిని కూడా అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. దీంతో నంబి నారాయణన్ 50 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసు కేరళ పోలీసుల నుంచి సీబీఐకి కేసు 1996లో బదిలీ అయ్యింది. అయితే, నంబీ నారాయణ్ పై వచ్చిన ఆరోపణలకు రుజువులు లేవని చెబుతూ సీబీఐ కేసును మూసేసింది. అంతేకాదు, విచారణ సందర్భంగా కేరళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక సమర్పించింది. శాస్త్రవేత్తలకు వ్యతిరేకంగా కేరళ పోలీసులు ఎలాంటి ఆధారాలను చూపించకపోవడంతో.. న్యాయస్థానం వారిని నిర్దోషులుగా విడుదల చేసింది.

అయితే, తనను అన్యాయంగా కేసులో ఇరికించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నంబి నారాయణన్ హైకోర్టును ఆశ్రయించారు. నాటి కేరళ ఏడీజీపీ సిబే మాథ్యూస్, కేకే జోష్వా, ఎస్ విజయన్‌లను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని 1998లో ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే, దీనిని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టవేయడంతో నంబి నారాయణన్ సుప్రీం తలుపుతట్టారు. శిక్ష అనుభవిస్తున్న సమయంలో తనను కేరళ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, మానసిక వేదనకు లోనైనట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై జరిగిన సుదీర్ఘ విచారణ తర్వాత.. 2018లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నంబీ నారాయణ్ అరెస్టు అక్రమమని, అతన్ని చిత్రహింసలకు, మానసిక వేదనకు గురిచేసినందుకు గాను ఆయనకు 50 లక్షలు చెల్లించాలని కేరళ పోలీసులకు నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు నంబీ నారాయణ్ ఆరోపణల్లో వాస్తవం ఎంతో కేరళ పోలీసులను విచారణ చేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి డీకే జైన్‌ను కోరింది.

దీంతో నంబి నారాయణన్ చేసిన 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించింది. అచంచల దేశభక్తుడైన ఓ శాస్త్రవేత్తపై పడిన దేశద్రోహి ముద్ర తొలగిపోయింది. ఆ తర్వాత నంబి నారాయణన్ దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం.. 2019లో ఆయనకు పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది. అటు, నంబి నారాయణన్ జీవితచరిత్రను ముందు తరాలకు అందించాలనే సదుద్దేశంతో.. ప్రముఖ తమిళ నటుడు ఆర్. మాధవన్ ‘రాకెట్రీ’ పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఆ బయోపిక్ త్వరలోనే విడుదల కాబోతోంది.

నంబి నారాయణన్ భారత దేశానికి భగవంతుడు అందించిన ఓ వైజ్ఙానిక గని. ఆయన గనుక ఇలా.. విదేశీ కుట్రలకు బలిపశువుకాకుండా వుండివుంటే,.. ఆయన చేసిన కృషి ఫలించి వుండివుంటే,.. పాతికేళ్ల క్రితమే భారత అంతరిక్ష చరిత్ర రూపురూపుఖలే మారిపోయేవి. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత కీర్తి పతాకం అగ్రపథాన నిలిచేది. నేడు రష్యా, అమెరికాలపై ఆధారపడకుండా సొంతంగా రాకెట్ ప్రయోగాలు చేస్తున్న భారత్.. నిజానికి, పాతికేళ్ల క్రితమే ఆ కలను సాకారం చేసుకుని వుండేది. చంద్రయాన్, మంగళ్ యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను సైతం.. అగ్ర దేశాలకంటే ముందే చేపట్టివుండేదంటే అతిశయోక్తి కాదు. నంబి నారాయణన్ కృషితో ఆనాడే మనకు క్రయోజనిక్ టెక్నాలజీ అందివుంటే,.. రాకెట్ ప్రయోగాలకు ఇతర దేశాలపై ఆధాపడివుండేవాళ్లం కాదు. తద్వారా దేశానికి వందల కోట్ల సంపద మిగిలివుండేది.

కానీ, అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని చూడలేక, నాటి ప్రభుత్వాల చేతగాని తనాన్ని, నిఘా వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని.. అగ్రదేశాలు పన్నిన కుట్రలో ఇస్రో బలైపోయింది. దేశం గర్వించదగ్గ నంబి నారాయణన్ వంటి శాస్త్రవేత్తలు దేశద్రోహిగా అపఖ్యాతిని మూటగట్టుగోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా.. నంబి నారాయణన్ పై కమ్ముకున్న చీకట్లు తొలగిపోతూవుండటం శుభ పరిణామం. అయితే, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఓ శాస్త్రవేత్త.. దేశద్రోహిగా ఆరోపణలు ఎదుర్కోవడం.. భరతమాత హృదయాన్ని ఎప్పుడూ కలచివేస్తూనేవుంటుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here