ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టుల పర్వం మొదలైంది. ఈ స్కామ్ మెల్లమెల్లగా ఇది సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ఈడీ జరిపిన దాడుల్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సన్నిహితులకు సంబంధించిన కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఇక, సోదాల్లో దొరికిన పక్కా ఆధారాలతో ఇప్పుడు అరెస్టులు మొదలుపెట్టారు సీబీఐ అధికారులు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన బోయిన్పల్లి అభిషేక్ రావు ను సీబీఐ అరెస్టు చేసింది. ఆయన స్వతహాగా కల్వకుంట్ల కవితకు బంధువు, సన్నిహితుడని చెబుతుంటారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది. ఈ లిక్కర్ భూతం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు ఇద్దరు అరెస్టయ్యారు. వారిలో మొదటివ్యక్తి విజయ్ నాయర్ కాగా.. రెండో వ్యక్తి బోయిన్ పల్లి అభిషేక్ కావడం.. కేసీఆర్ అండ్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ చెందిన పలువుర రాజకీయ నాయకులకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.
బోయిన్పల్లి అభిషేక్ రావు పలు కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వీటిలో రియల్ ఎస్టేట్, మైనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి సంస్థలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలకంగా ఉన్న రామచంద్రన్ పిళ్ళైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. అభిషేక్ డైరెక్టర్‌గా ఉన్న రాబిన్ డిస్టిలరీస్ కంపెనీయే లిక్కర్ టెండర్లను ఎక్కువశాతం దక్కించుకోవడంతో.. సీబీఐ, ఈడీలు ఆ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్‌పై దృష్టిసారించాయి. లిక్కర్ స్కామ్‌లో ఎ-14గా ఉన్న రామచంద్రన్ పిళ్ళైతో కలిసి తన వ్యాపారాలు నిర్వహించాడు. వీరిద్దరికీ కల్వకుంట్ల కవితకు దగ్గరి సంబంధాలున్నట్టు తెలుస్తోంది. రామచంద్ర పిళ్ళై, బోయిన్పల్లి అభిషేక్రావులతో కలిసి 2022 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళొచ్చారు. ప్రత్యేక పూజల తర్వాత తీయించుకున్న ఫోటోలను అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బయటపెట్టి సంచలనం సృష్టించారు. వీరిద్దరి ఇళ్ళలో గతంలోనే ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాల్లో దొరికిన పక్కా ఆధారాలతో బోయిన్పల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ అరెస్టుతో లిక్కర్ స్కామ్‌లో మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. గతంలో ఈ కేసుకు తనకు ఏ మాత్రం సంబంధం లేదని కల్వకుంట్ల కవిత బుకాయించే ప్రయత్నం చేశారు. అంతేకాదు,.. తనపై అసత్య ఆరోపణలు చేసేవారిపై పరువునష్టం దావా కూడా వేస్తామని తెలిపారు. తాజాగా ఏకంగా కవిత పీఏగా చెప్పుకుంటున్న వ్యక్తే అరెస్ట్ అరెస్టు కావడంతో.. ఈ కేసులో కవితకు కూడా ప్రత్యక్ష ప్రమేయముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీలో కోవిడ్ సమయంలో లిక్కర్ పాలసీలో భారీ అవకతవకలు జరిగినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో ఏదైనా పాలసీలో మార్పులు చేయాలంటే దానికి ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందాలి. అయితే ఈ ఆమోదం లేకుండానే కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలో మార్పులు తీసుకువచ్చారు. ఈ పాలసీలో లైసెన్సులను లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా మార్చడం, లైసెన్సులను తక్కువ ధరకే దక్కేలా చేయడం వంటి అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో కేసీఆర్ కూతురు తన వ్యాపారులతో ఈ స్కామ్‌లో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి డబ్బు సరఫరా చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోయిన్పల్లి అభిషేక్ రావును అరెస్టు చేయడంతో బీఆర్ఎస్లో ప్రకంపణలు మొదలయ్యాయి. ఇప్పటికే కవితపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దాదాపు కవిత దగ్గరికి రావడంతో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
జాతీయ పార్టీ ప్రకటించి ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా చక్రం తిప్పుదామనుకున్న కేసీఆర్ కు కవిత రూపంలో చుక్కెదురైంది. పార్టీ ప్రచారం మాట అటుంచితే తాజా పరిణామాలతో లిక్కర్ స్కామ్ రూపంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పేరు మారుమ్రోగిపోతోంది. అరెస్టయిన బోయిన్పల్లి అభిషేక్ రావు సీబీఐ విచారణలో ఏ నిజం బయట పెడతాడో తెలియని భయం పార్టీ నాయకులను వెంటాడుతోంది. ఈడీ, సీబీఐలు ఈ కేసులో ఇదే దూకుడు కొనసాగిస్తే కవిత కూడా అరెస్టయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ జాతీయ పార్టీ మాట అటుంచితే,.. లిక్కర్ కేసులో తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడమే ఆ పార్టీకి తలకుమించిన భారం కావడం ఖాయంగా కనిపిస్తోంది.