ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చిక్కులు తప్పేలా లేవు. ఐతే ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. ఆయనను ఢిల్లీకి తరలిస్తున్నారు. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరపగా.. ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది.
ఢిల్లీకి తరలించిన అనంతరం రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీలో ఆడిటర్ బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. అందులో భాగంగానే ఆయన ఇంట్లో సోదాలు జరపడంతో పాటు పలుమార్లు విచారించింది. ఇప్పుడు ఆయన పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియడంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైకి ఛార్టెడ్ అకౌంటెంట్‌గా బుచ్చిబాబు పనిచేశారు.
అలాగే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బుచ్చిబాబు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆయన అరెస్ట్‌తో కవితకు కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కవితకు అత్యంత సన్నిహితుడిగా కూడా బుచ్చిబాబు ఉన్నారు. ఇప్పటికే కవితను ఈ స్కాంలో సీబీఐ ప్రశ్నించడంతో పాటు ఇటీవల ఛార్జిషీట్‌లో ఆమె పేరును కూడా చేర్చింది. ఇలాంటి తరుణంలో బుచ్చిబాబు అరెస్ట్ బీఆర్ఎస్ వర్గాలకు టెన్షన్ పుట్టిస్తోంది. బుచ్చిబాబు అరెస్ట్‌తో త్వరలో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముందని వార్తలొస్తున్నాయి.
ఐతే ఢిల్లీ ఎక్సైజ్ కేసు అనుబంధ ఛార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ గతంలో ప్రస్తావించింది. ఈ కుంభకోణంలో సౌత్‌గ్రూప్ విజయ్‌నాయర్ ద్వారా.. ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ తెలిపింది. ఇక కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని వెల్లడించింది. విజయ్ నాయర్ ఆదేశాల మేరమే ఇండోస్పిరిట్‌లో 65శాతం కవిత… మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు పేర్కొంది. ఇండో స్పిరిట్‌లో కవిత రూ. 3 కోట్ల 40 లక్షలు, మాగుంట రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరఫున అరుణ్‌పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన సీఏ ప్రస్తుతం అరుణ్‌పిళ్లైకి సీఏ గా ఉండటం కొసమెరుపు.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెన్నైలో పర్యటించనున్నారు. ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్సీ కవిత ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో 2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు ? అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొంటారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచి శివ, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతారు. అంతే కాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు. ఇలాంటి తరుణంలో కవితకు అత్యంత సన్నిహితుడైన మాజీ సీఏను అరెస్ట్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.