More

  ‘MAA’లో ఎన్నికల కుంపట్లు..! అధికార సిగపట్లు..!!

  ‘‘వినోద ప్రక్రియలో పోగుపడిన సంపద – విలాసంలోనే మునిగి తేలుతుంది తప్ప సంక్షేమం వైపు చూపు మరల్చదు. కథాశిల్పం వాణిజ్య సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత కరెన్సీ కౌంటింగ్ మెషిన్ వైపు చూపు విసురుతుంది మినహా.. లైట్ బాయ్ ఆకలి గురించి కాదు’’ అన్నారు ‘ఫిల్మ్ ఇండియా’ సంపాదకులు స్వర్గీయ బాబూరావ్ పటేల్ తన ‘‘Grey dust’ పుస్తకంలో ..

  బాబూరావ్ పటేల్ కరడుగట్టిన జాతీయవాది. నెహ్రూ పొడగిట్టని తత్వం. జాతివ్యతిరేక సినిమాలను నిరసించిన వ్యక్తిత్వం ఆయనది. కొరడాల్లాంటి తన విమర్శలతో హిందీ సినీ సామ్రాజ్యానికి జడుపు పుట్టించిన సాహస పాత్రికేయుడు బాబూరావ్ పటేల్. మూవీ అర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నిక వివాదం, చిత్రపురి కుంభకోణ రహస్యం, ఫిక్షన్ మించిన ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ అవినీతిబాగోతం.. వెలుగుచూసిన తర్వాత కాస్తోకూస్తో తెలిసినవారికి బాబూరావ్ పటేల్ గుర్తుకు రావడం సహజం. 

  అనేక సామాజిక అంశాలను, చారిత్రక వాస్తవాలను తెరకెక్కించే సినిమా రంగం-స్వయంగా తనే ఓ కథా వస్తువుగా, వివాద అంశంగా మారి పత్రికల ప్రత్యేక కథనాల్లో, ప్రైమ్ టైమ్ న్యూస్ రూమ్ డిబేట్స్ లో దర్శనమిస్తుంటే కనీసం కొంతమందినైనా ‘మా’ వివాదం మరో తరహా వినోదంలా అలరిస్తోంది.

  లోకంలోని కుళ్లును మాత్రమే కాదు, ‘మా’ అంతర్గత కుమ్ములాటలను సైతం మన తెలుగు సినీ కళాకారులు తెరకెక్కిస్తే అది వారి నిజాయితీని ప్రతిబింబిస్తుంది. సినిమాను మించిన డ్రామ, థ్రిల్లర్ ను తలదన్నే ఉద్విగ్నత, సస్పెన్స్ ను మీరిన ఉత్కంఠ ‘మూవీ ఆర్టిస్స్ట్ అసోషియేషన్’లో ఉన్నాయని ఇటీవలి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.

  ‘మా’ ఎన్నికల వివాదం నాలుగు ముఖ్యమైన అంశాలను చర్చకు తెచ్చింది.

  1. కళాకారుల సామాజిక బాధ్యత అబద్ధమనే ఆరోపణ
  2. కళాకారులు లేదా నటులు ప్రాంతం, భాష అనే పరిమితికి అతీతమా?
  3. తెలంగాణ భాష కాదు, కేవలం ‘మాండలీకం’ మాత్రమేనా?
  4. ప్రకాశ్ రాజ్ తటస్థ వైఖరిపై నాగబాబు వ్యాఖ్యల వ్యవహారం.

  తెలుగు సినిమాల్లో వీరాధివీర ప్రతిమల్లా కథానాయక పాత్రల్లో దర్శనమిచ్చే మన నటశిఖామణులు… కరోనావేళ విలాసవంతమైన భవనాల్లో, వినోద కలాపాల్లో మునిగి తేలారు. వ్యాయామం వల్ల పొడుచుకు వచ్చిన కండరాలను వివిధ భంగిమల్లో ప్రదర్శనకు పెడితే, మరికొంతమంది ఇన్ స్టా గ్రామ్ స్క్రీన్ పై మిరుమిట్లుగొలిపే రంగుల దుస్తుల్లో దర్శనమిచ్చి దరిద్రుల హాహాకారాల్నీ, రోగుల ఆక్రందల్నీ ఎగతాళి చేశారు. పరీక్షా కాలంలోనే సహజ స్వభావం బయటపడుతుందని భాగవతం చెప్పిన మాట ఆపత్కాలంలో నిష్ఠూరమైన నిజంగా తారసపడింది. సేవా భావనను ఆచరణలో చూపిన తారలకు ఈ విమర్శలను మినహాయించవచ్చు.

  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు మరోసారి సాధారణ ఎన్నికలను తలపించేలా జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు లాంటివారు పోటీ పడుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

  ‘మా’ ప్రతిష్ఠ మసకబారిందనీ, అవినీతి రాజ్యమేలుతోందనీ, కొంతమంది గుప్పిట్లో ‘మా’ బందీగా ఉందనీ, 27 ఏళ్లు గడచినా సంస్థకు ఓ భవనం లేదనీ, సామాజిక వర్గాల సమీకరణలే ఇక్కడా చెల్లుబాటు అవుతున్నాయనీ…ఇలా రకరకాల విమర్శలు, ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

  సంపద పోగుపడిన ప్రాంగణంలోకే ప్రవేశిస్తుంది అధికారం. అధికారం అనేది రూపొందాక, వందిమాగధ మూకలూ, భట్రాజ బృందాలు దాని చుట్టూ చేరతాయి. ‘పవర్ సెంటర్’ చుట్టూ ప్రదక్షిణలు చేసి అందరికీ అందాల్సిన వాటిని అప్పనంగా దండుకుంటాయి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్’ అందుకు అతీతం కాదు.

  చాలా మంది ప్రముఖులు ‘మా’లో రాజకీయాలు ప్రవేశించాయని తెగ దిగాలుపడుతున్నారు. నిజానికి రాజకీయాలు ప్రవేశిస్తే వాటిల్లే నష్టం తక్కువ, కానీ, క్షుద్ర రాజకీయాలు వచ్చి చేరితేనే పరిణామాలు ఊహించలేనంత అనారోగ్యకరంగా తయారవుతాయని ‘మా’ అంతర్గత పరిణామాలు నిరూపిస్తున్నాయి.

  కరోనా కాస్త తెరిపి ఇచ్చిందని అందరూ అంటున్న వేళ ‘అధికార పీకులాట’లో కూరుకుపోయింది తెలుగు సినిమారంగం. ముఠాలూ, వర్గాలూ, సామాజిక వర్గాలూ, కులాల ప్రాబల్యాలూ అన్నీ…‘మా’లో మేటవేసి నేడు అది రాజకీయాన్ని తలదన్నేలా మైమరపిస్తున్నది.

  న్యాయసూత్రానికీ, తర్కానికీ మధ్య అన్ని సందర్భాల్లో సయోధ్య కుదరదు. కొన్నిసార్లు తర్కం న్యాయసూత్రాన్ని ఎగతాళి చేస్తుంది. అప్పుడప్పుడూ న్యాయసూత్రం తర్కాన్ని ఆటపట్టిస్తుంది. నటులకు భాష, ప్రాంతంతో సంబంధం లేదూ అన్నారు సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్. ఈ వ్యాఖ్య యథాలాపంగా వింటే ఎవరికైనా అవును కదా, సముచితమైన వాదనే కదా అనిపిస్తుంది. ఒకానొక కథ, సినిమా శిల్పంగా మారాలంటే నటులు కావాలి. అక్కడ నటుల భాషా, ప్రాంతంతో సంబంధం ఉండదు. సదరు కథావస్తువులోని పాత్రకు నటుడు ఒదిగాడా లేదా అన్నదే ప్రమాణం. ఇంతవరకు ఈ వాదన సబబే!

  కానీ, నిర్దిష్టమైన ప్రాంతంలో పరిశ్రమ ఉన్నపుడు, ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు సినిమా రంగంలో పనిచేస్తున్నపుడు, ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక ప్రయోజానలూ, సంక్షేమ ప్రయోజనాలు లేదా పథకాలు ఇమిడి ఉన్నపుడు, సదరు ప్రాంత కళాకారులు సుదీర్ఘ కాలంగా అన్యాయానికి గురైనట్టూ భావిస్తున్నపుడు…. భాషా, ప్రాంతంతో సంబంధం లేదనే వాదన నిలబడుతుందా?

  అంతేకాదు, ప్రాంతీయ అకాంక్షను ప్రజాస్వామిక ప్రభుత్వాలు గుర్తించి, చట్టబద్ధమైన విభజన చేసినప్పుడు అందుకు సంబంధించిన న్యాయమైన హక్కులను గుర్తించ నిరాకరించడం సరైందేనా? విశ్వమానవుల్లాగే నటులు కూడా విశ్వవ్యాప్తమే కావచ్చు, దాన్నెవరూ నిరాకరించలేం. కానీ, స్థానిక ప్రజల, కళాకారుల అభిప్రాయాలూ, అభినివేశాలూ, ఆకాంక్షలూ, ప్రయోజనాలు, సంక్షేమం గురించి ‘మా’ లాంటి సంస్థలు ఆలోచించవా?

  ‘గ్రామాలు దత్తత తీసుకున్నపుడు, ప్రాంతేతరులమని గుర్తుకు రాలేదా?’ అంటూ ప్రకాశ్ రాజ్ గారు చిత్రమైన ప్రశ్నవేశారు. తర్కం, వ్యంగ్యం వారి మాటలో నిత్యం తొంగిచూస్తుంటాయి. చార్లెస్ డికెన్స్ నాటకం ‘‘Great Expectation’’ లోని దరిద్రుల నిర్వేదం నుంచి హెన్రిక్ ఇబ్సన్ రాసిన ‘‘Dolls house’’ నాటకంలోని విషాదాంతం వరకూ ప్రకాశ్ రాజ్ చెప్పే ఉద్వేగభరిత సన్నివేశాల్లోని చారిత్రక అంశాలను మనస్ఫూర్తిగా అంగీకరించాల్సందే! కానీ, వాటిలో ధ్వనించే ప్రజాస్వామిక విలువ ఎక్కడైనా ప్రకాశ్ రాజ్ ప్రకటించిన ‘మా’ ప్యానెల్ లో కనిపించిందా అన్నదే ప్రశ్న.

  సీవీఎల్ నరసింహారావు గారు సమయోచితమైన సవాలు విసిరారు. ఏ ప్యానెల్ లో అయినా తెలంగాణ కళాకారులకు సముచిత స్థానం ఇస్తే తాను బరినుంచి వెనక్కి తగ్గుతానంటూ ప్రకటించారు. సీవీఎల్ అలాంటి ప్రకటన చేయగానే చర్చ తెలుగు భాషపైకి మళ్లింది. ‘కళ విశ్వవ్యాప్తమైందంటూ’ తాత్విక వ్యాఖ్యానాలు వినిపించడం మొదలైంది. నిజానికి సీవీఎల్ గారి డిమాండ్ అసంబద్ధమైందేమీ కాదు. సీవీఎల్ హేతుబద్ధమైన వైఖరి గురించి చర్చ జరగాల్సిందే!

  ఇక నాగబాబు గారు ప్రకాశ్ రాజ్ ‘తటస్థ’ వైఖరి గురించి పొగడ్తలు కురిపించారు. తటస్థ వైఖరిని స్వయంగా ప్రకాశ్ రాజే ఒప్పుకోరు. కళా రంగంలో వామపక్ష సైద్ధాంతిక ప్రమాణాన్ని అంగీకరించిన ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లోనూ అదే వైఖరిని కొనసాగించారు. కాబట్టి నాగబాబు గారి కితాబు ప్రకాశ్ రాజ్ పట్ల ఆయనకున్న సదభిప్రాయాన్ని తెలియజేస్తుంది తప్ప వాస్తవాన్ని కాదు.

  ముఖ్యమంత్రి కేసీఆర్ తో సఖ్యతగా మెలిగినంత మాత్రాన తెలంగాణను గౌరవించినట్టు కాదు, తాను ప్రకటించిన తెలంగాణ కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వడం వల్ల మాత్రమే తాము ప్రయోజనం పొందుతున్న ప్రాంతానికి మేలు చేసినట్టనే వాస్తవం ప్రకాశ్ రాజ్ గుర్తించాలి. భౌగోళిక విభజన ఏర్పడ్డాక అందులోని సాంకేతిక అంశను మాత్రమే కాదు, సామాజిక దురవస్థను సైతం పరిగణలోకి తీసుకోవాలి.

  సీనియర్ నటులు, తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే కళాకారులు కోట శ్రీనివాసరావుగారు ఓ టీవీ ఛానల్ చర్చలో సీవీఎల్ నరసింహారావు గారి వాదనకు స్పందిస్తూ గమ్మత్తైన వ్యాఖ్య చేశారు. ‘‘తెలంగాణలో మాట్లాడేది తెలుగుభాషే కానీ, మాండలీకం మాత్రమే భిన్నం’’ అంటూ గోదావరి జిల్లాల మాండలీకం ఉదాహరణ సెలవిచ్చారు.

  తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ భాష’ ప్రత్యేకంగా నిర్వచించింది. అందుకు తగిన సాధికారిక కారణాలను మాత్రం ప్రభుత్వం విస్తృతంగా తెలిపే ప్రయత్నం చేయలేదు.

  తెలంగాణలో మాట్లాడేది తెలుగే అయినప్పటికీ,  మాండలీకం పేరుతో తెలంగాణ భాషలోని మౌలిక ప్రత్యేకతలను గుర్తించ నిరాకరించడం సబబు కాదు. భాషా శాస్త్రవేత్తలు ఒక వ్యక్తిలోనే ఆయా సందర్భాలలో భిన్న ఉచ్చారణల ఆధారంగా వివిధ మాండలికాలుంటాయని చెప్పారు. ఈ సూత్రీకరణ ఆధారంగా ఏ భాషలోనైనా మాండలికాలను నిర్ణయించ పూనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. ఒక దేశం లేదా ఒక రాష్ట్రానికి చెందిన ప్రజలు వ్యవహరించే భాషను దగ్గరగా పరిశీలిస్తే ఉచ్చారణలోని వ్యవధి, యాసను బట్టి భిన్న ప్రాంతీయాలుగా తోస్తాయి. విస్తృత వ్యవహారంలో తెలుగుభాష అందుకు అతీతమైంది కాదు.

  తెలంగాణలో హైదరాబాద్ మినహాయిస్తే ప్రతిజిల్లాకు ఇతర భాషా సమూహాలతో నిత్య సంపర్కం ఉంది. కన్నడ, మరాఠీ, హల్బీ, హిందీ భాషలు మాట్లాడే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు తెలంగాణ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

  ఒకే జిల్లాకు రెండు భిన్నభాషా రాష్ట్రాలు సరిహద్దులుగా కూడా ఉన్నాయి. అంతేకాదు, నిజాం పాలనలో ఉర్దూ అధికార భాషగా ఉండటం, ఉత్తరాది ప్రజలు తెలంగాణకు వలస రావడం వల్ల ఈ మొత్తం పరిణామాలు భాషపై అనివార్యమైన ప్రభావం చూపాయి. భిన్న భాషల ఆదాన, ప్రదానాలు తెలంగాణ ప్రజల  భాష స్వరూప, స్వభావాలను మార్చివేశాయి.

  మరో ఉదాహరణ తీసుకుందాం. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు ఇతర భాషా రాష్ట్రాలు సరిహద్దులుగా లేవు. అయినా సరే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మాండలీకం చాలా భిన్నంగా ఉంటుంది. అలాంటిది దీర్ఘకాలం రకరకాల భాషల మధ్య నలిగిన తెలంగాణ ప్రాంత భాష అనేక వైరుధ్యాల నడుమ ప్రత్యేకమైన భాషగా రూపొందింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అంతా తెలుగువారమే అనే భావన బలపడింది. కానీ, మలిదశ ఉద్యమం కన్నా ముందు తెలంగాణలో మాట్లాడేది తెలుగే కాదనే వ్యాఖ్య బాహటంగానే వినిపించేది.

  మాండలీక దశ నుంచి ప్రత్యేక భాషగా రూపొందిన కారణంగానే సాంస్కృతిక వైరుధ్యం మరింత తీవ్రమైంది. అది మిగతా రంగాలకు విస్తరించింది. వైరుధ్య విస్ఫోటనం మొదలయ్యేది ప్రథమంగా సాంస్కృతిక, కళారంగాల్లోనే అన్నది అందరూ అంగీకరించే వాస్తవం. సద్యోజనితంగా ఉద్వేగాలను రేకెత్తించేది తొట్టతొలిగా భాష, ఆ తర్వాత ఆహార అలవాట్లు.

  ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్’ వ్యవహారాల్లో అవినీతి, బంధుప్రీతి, సామాజిక వర్గాల ప్రాబల్యం, అధికార కేంద్రాల నిర్వాహణలో కొందరికి అవమానం.. ఇవన్నీ సహజం. వీటిని నివారించడం, అది కూడా సినిమా రంగంలో అసాధ్యమనే చెప్పాలి. ఎటొచ్చీ, చాలా మామూలు ఆకాంక్షలను సైతం పరిగణలోకి తీసుకోవడానికి ఇన్ని వంకలు పెట్టడం వెనుక ఉద్దేశాలేమిటో ఒక పట్టాన అర్థం కాదు.

  దశాబ్దాలుగా సినిమా రంగంలో పనిచేసిన అనేక మంది కళాకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పత్రికల్లో వారిగురించి దయనీయ కథనాలు వస్తున్నాయి. సినిమా అంటే డబ్బు వ్యవహారం, నటన మాత్రమే వస్తే కుదరదు అనే భావన అంతటా వేళ్లూనుకున్నది. ఇలాంటి సందర్భంలో, కరోనా విపత్తు తొలగిందో లేదో తెలియని ప్రమాదకరమైన స్థితిలో ‘తెలుగు సినిమా రంగం’ మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ అధికార కుమ్ములాటలో, ఆస్తుల పోట్లాటలో పత్రికలకెక్కడం ఆ రంగానికే అవమానమని సినీ పెద్దలు గుర్తించాలి.

  Trending Stories

  Related Stories