స్కూల్ లో ట్యాపులు, పైపులు దొంగతనం చేసిన పాక్ మాజీ మంత్రి..!

0
271

పాకిస్థాన్ మాజీ మంత్రిపై ప్రభుత్వ పాఠశాలల్లోని బాత్ రూముల్లో ట్యాప్ దొంగతనంతో సహా 11 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్ మాజీ మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సీనియర్ నాయకుడు ఫవాద్ అహ్మద్ హుస్సేన్ చౌదరిపై పలు కేసులు నమోదయ్యాయి. పాక్ లోని పంజాబ్ పోలీసులు విచారణ సందర్భంగా ఫవాద్ అహ్మద్ హుస్సేన్ చౌదరిపై దాఖలైన అన్ని కేసులపై నివేదికను ఇటీవల సమర్పించారు. అందులో ఆయన పాఠశాలల్లో ట్యాపులు, పైపులు కూడా దొంగతనం చేశారనే అభియోగాలు నమోదయ్యాయి.

ఫవాద్ అహ్మద్ హుస్సేన్ చౌదరిపై 889/23 కేసును ముల్తాన్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. పాఠశాలలో పైపులు, కుళాయి చోరీకి గురైన కేసులో ముజఫర్ హనీఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఖైర్‌పూర్ భట్టా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి విద్యుత్ వైర్‌ను కూడా దొంగిలించారు. ఇదంతా ఆయన కనుసన్నులలోనే జరిగిందని అంటున్నారు. దీనిపై ముల్తాన్ కంటోన్మెంట్ పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, జలీలాబాద్, ముల్తాన్ ఓల్డ్ కొత్వాలి పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి నమోదైంది. న్యూ ఎయిర్‌పోర్ట్ పోలీసులు దాఖలు చేసిన ఒక కేసులో ఫవాద్ చౌదరి నిర్దోషి అని నిరూపించబడింది. ముల్తాన్, ఫైసలాబాద్‌లో దాఖలు చేసిన మరో రెండు కేసులు కొట్టివేశారు.

ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారం నుండి వైదొలిగిన తర్వాత తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకులకు కొత్త ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ విషయమై దేశం మొత్తం తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా తనను అరెస్టు చేయడమో, చంపడమో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇమ్రాన్‌ ఖాన్‌పై సైన్యం గనక చర్యలు చేపడితే పాక్‌లో పౌరయుద్ధం తప్పదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.