More

    ఎమ్మెల్యే మైనంపల్లితో సహా 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తల పై కేసులు

    మల్కాజిగిరి జీహెచ్ఎంసీ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల్లో మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య మొదట వాగ్వివాదం జరిగింది. ఇంతలోనే టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను కొట్టారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ శ్రవణ్ తో మాట్లాడుతూ ఉండగానే అక్కడున్న మైనంపల్లి అనుచరలు బీర్ బాటిల్స్ తో కార్పొరేటర్ శ్రవణ్ పై దాడి చేశారు. దీంతో శ్రవణ్ కు గాయాలయ్యాయి. ఆయనను మల్కాజిగిరి ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలో దాడి జరిగింది. ఆ విజువల్స్ రికార్డు చేస్తున్న మీడియాపై దాడి చేసి కెమెరాలు, ఫోన్లు లాక్కొని వెళ్లిపోయారు టీఆర్ఎస్ కార్యకర్తలు.

    జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ తదితరులతో కలసి బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని, రేపటి నుంచి ఎమ్మెల్యే కబ్జాలన్నీ బయటకు తీస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి అని తెలిసే బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి చాలా నీచమైన వ్యక్తి అని.. గూండాయిజం, దాడులతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు బండి సంజయ్. బీజేపీలో చేరదామని వస్తే మేం తరిమికొట్టామని.. అలాంటి వ్యక్తిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు. ఖబర్దార్ మైనంపల్లి.. నువ్వు పైసలతో, గూండాయిజంతో రాజకీయం చేస్తున్నావ్. మేము పార్టీ జెండాలతో పోరాడుతున్నాం.. నీ ప్రభుత్వం, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు…రేపటి నుండి నీ సంగతి చూస్తాం.. నీ అక్రమాలను బయటపెడతాం.. నీ రౌడీయిజాన్ని తొక్కిపడేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడి జరుగుతున్న సమయంలో పట్టించుకోని పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై తక్షణమే డీజీపీ స్పందించాలని.. మైనంపల్లి సహా టీఆరెస్ గూండాలపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో బీజేపీ సత్తా చూపుతామని ఆయన హెచ్చరించారు.

    బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై బీర్ బాటిళ్లతో దాడి చేసి గాయపరచిన ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు స్పందించి ఐపీసీ సెక్షన్స్ 307, 323,324,143,147,149 కింద కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తోపాటు మరో 15 మంది కార్యకర్తల పై కేసులు నమోదు చేశారు.

    Trending Stories

    Related Stories