బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపియన్ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో సిద్ధార్థ్ సైనాకు క్షమాపణలు చెప్పాడు. డియర్ సైనా నేనో అసభ్యకరమైన జోక్ చేశానని, అందుకు క్షమించాలని కోరాడు. మీ ట్వీట్‌కు తాను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అది తాను దురుద్దేశంతో చేసిన ట్వీట్ కాదని, మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చాడు. తన ట్వీట్‌లో లింగ వివక్ష ఏమీ లేదని, మీరు మహిళ కాబట్టి దాడి చేయాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని అన్నాడు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెడదామని .. మీరెప్పుడూ నా చాంపియనేనని, తన క్షమాపణలు అంగీకరిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ లేఖలో చెప్పుకొచ్చాడు.
సిద్ధార్థ్ క్షమాపణలపై సైనా స్పందించింది. ఆయనే ట్విట్టర్లో ఏదో అన్నారని… ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని తెలిపింది సైనా. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని.. ఆయన క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని తెలిపింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని.. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ట్వీట్ చేసింది.
మరోవైపు సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. సామాజికవేత్త ప్రేరణ సిద్ధార్థ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్లర్ సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ అభ్యంతరకరమైన ట్వీట్ చేశారని ప్రేరణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్‌పై ఐపీసీ 509 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్ధార్థ్‌పై రెండు ఫిర్యాదులు అందగా, ఒక ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనపై సైనా ఈనెల 5న ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘ప్రధాని భద్రతలో రాజీపడిన పరిస్థితి ఎదురైతే, ఏ దేశమైనా సురక్షితంగా ఉంటుందని ఎలా అనుకోగలం’ అని అన్నారు. దీన్ని సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ అభ్యంతకరమైన పదాలను వాడాడు.