కర్ణాటక రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. ఈ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పునీత్ ప్రస్తుతం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిపుణులైన వైద్య బృందం పునీత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విక్రమ్ ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ లో వెల్లడించాయి. పునీత్ ఆసుపత్రిపాలైన విషయం తెలుసుకుని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పునీత్ వయసు 46 సంవత్సరాలు. ఆసుపత్రికి పలువురు సెలెబ్రిటీలు చేరుకుంటూ ఉన్నారు.