National

చూస్తుండగానే కారు భూమి లోపలికి అలా వెళ్ళిపోయింది..!

సింక్ హోల్.. అప్పుడప్పుడు వీటి గురించి మనం వింటూ ఉంటాం. కానీ అది ఏమి చేయగలదో ముంబైలో రికార్డు చేసిన ఓ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. సింక్ హోల్ కారణంగా క్షణాల్లో ఓ కారు భూమి లోకి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరూ గమనించవచ్చు. ముంబై లోని ఘట్కోపార్ రెసిడెన్షియల్ సొసైటీలో పార్కింగ్ స్థలంలో సింక్ హోల్ ఏర్పడింది. అది ఏకంగా కారునే మింగేసింది. హ్యుందాయ్ వెన్యూ కార్ ను సింక్ హోల్ మింగేసిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కారు యొక్క బోనెట్ మరియు ముందు చక్రాలు మొదట సింక్ హోల్ లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించగా.. అలా కారు మొత్తం లోపలికి వెల్లిపోయింది. కారు సమీపంలో ఆపి ఉంచిన ఇతర వాహనాలకు.. దాని ప్రక్కన ఉన్న కార్లకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

67 ఏళ్ల వైద్యుడు, కారు యజమాని ఈ సంఘటనను వీడియో తీశారు. ఈ వీడియో ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉంది. రామ్ నివాస్ బిల్డింగ్స్ లో పాత బావిపై పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ముంబై లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ సింక్ హోల్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం కారును బయటకు తీసే ప్రయత్నాలను చేశారు. పార్కింగ్ స్థలం కూలిపోయిన భాగం నుండి నీటిని బయటకు పంపించి కారు ఎక్కడ ఉందో గుర్తించారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు, బిఎంసి అధికారుల సహాయంతో రాత్రి 9 గంటల సమయంలో కారును సింక్ హోల్ నుండి బయటకు తీయగలిగారు. “తాము పంపులను ఉపయోగించి బావి నుండి నీటిని తీసివేసామని.. వాహనాన్ని గుర్తించిన తరువాత, దానిని క్రేన్ సహాయంతో బయటకు తీశాము” అని ఓ అధికారి వెల్లడించారు.

కారు యజమాని డాక్టర్ కిరణ్ దోషి మాట్లాడుతూ ఈ కారును తమ కుమారుడు వినియోగిస్తూ ఉంటాడని వెల్లడించారు. ఆదివారం కావడంతో తమ కుమారుడు బయటకు వెళ్ళకపోవడంతో కారును పార్కింగ్ స్థలంలో ఉంచారు. ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో, రామ్ నివాస్ అపార్ట్మెంట్లలో కార్లను కడిగే మహాదేవ్ షిగ్వాన్ అనే వ్యక్తి.. కాంక్రీట్ భాగం లోపలికి వెళ్లడాన్ని గమనించి.. కారు యజమానితో చెప్పాడు. అక్కడికి కారు యజమాని చేరుకోగా అప్పటికే కారు బావిలో మునిగిపోతున్నట్లు గుర్తించారు. ఆ సమయంలోనే వీడియోను రికార్డు చేశామని తెలిపారు. ఈ భవనం 80 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు స్థానికులు తెలిపారు. 40 సంవత్సరాల క్రితం బావిని మూసి.. కాంక్రీట్ తో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ‘బావిని సగం కాంక్రీట్ భాగంతో మూసి వేసి.. ఇంకొంత భాగాన్ని తెరిచి ఉంచారని.. ప్రతిఒక్కరూ అక్కడ కార్లను పార్క్ చేస్తారని..ఇలా జరగడం ఇదే మొదటిసారని’ దోషి వెల్లడించారు.

ఘట్కోపార్ ట్రాఫిక్ విభాగానికి చెందిన సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ మంజ్రే మాట్లాడుతూ, “సంవత్సరాల కిందట వేసిన కాంక్రీట్ నిర్మాణం వర్షాల కారణంగా బలహీనపడిందని.. ఇటీవల కురిసిన భారీ వర్షపాతం ఈ ఘటనకు దారితీసిందని మేము భావిస్తున్నాము.” అని తెలిపారు. ఈ సంఘటన ఒక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో చోటు చేసుకుందని సివిక్ బాడీతో ఎటువంటి సంబంధం లేదని బిఎంసి తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − two =

Back to top button