నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గా విగ్రహ నిమజ్జనాకి వెలుతున్న భక్తుల పై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జాస్పూరు జిల్లా పాతల్‌గావ్ ప్రాంతంలో నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దసరా రోజున ఊరేగింపుగా అమ్మవారి విగ్రహా నిమజ్జనానికి తీసుకువెలుతున్నారు. ఆ సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు భక్తులపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 16 మంది గాయపడగా వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బబ్లూ విశ్వకర్మ (21), శిశుపాల్ సాహు (26) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కారు నుంచి పెద్ద ఎత్తున గంజాయిన స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. ఇది విషాదకర ఘటన అని.. నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.