More

    సంచలన విషయాలను బయటపెట్టిన పాకిస్తాన్ తీవ్రవాది

    సెప్టెంబరు 26 న భారత సైన్యం ‘అలీ బాబర్ పాత్ర’ గా గుర్తించబడిన ఒక లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉరి సెక్టార్‌లో సెప్టెంబర్ 18 – సెప్టెంబర్ 19 మధ్య రాత్రి సమయంలో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించారు. వారిలో అలీ బాబర్ కూడా ఒకడు. భారతదేశంలోని నియంత్రణ రేఖకు(ఎల్.ఓ.సి.) సమీపంలో ఉన్న జాబ్రి పోస్ట్ నుండి ఆరుగురు ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడడానికి ఎల్ఈటి ప్రయత్నించిందని ఆర్మీ తన ప్రకటనలో తెలిపింది. నలుగురు ఉగ్రవాదులు వెనక్కి పారిపోగా.. ఇద్దరు ఉగ్రవాదులు భారతదేశం వైపు ప్రవేశించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం అనుమానిత ప్రాంతాల్లో అనేక సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం పంజాబ్ (పాకిస్తాన్) కు చెందిన 33 ఏళ్ల పాకిస్థాన్ తీవ్రవాది అతీక్ ఉర్ రెహ్మాన్ అలియాస్ క్వారీ అనాస్ ను భారత భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది. రెండవ ఉగ్రవాది పంజాబ్ (పాకిస్తాన్) ఒకారాకు చెందిన అలీ బాబర్ పాత్రగా గుర్తించారు. అతడిని లొంగిపోవాలని సూచించారు. దీంతో అతన్ని సజీవంగా పట్టుకున్నారు. పాక్ ఉగ్రవాది సజీవంగా పట్టుబడటం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. అలీ బాబర్ ను ఆర్మీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పాక్ ఉగ్రవాది పలు విషయాలను వెల్లడించాడు.

    అతడు కెమెరా ముందుకు వచ్చి పాకిస్తాన్ కుతంత్రాలను బయట పెట్టాడు. తనకు పాక్ ఆర్మీ, లష్కరే తాయిబా ఉగ్రసంస్థలు శిక్షణ ఇచ్చాయని స్పష్టం చేశాడు. బారాముల్లాలో ఒక ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు రూ. 20 వేలు ఇచ్చారని.. తమది పేద కుటుంబమని, తనకు తండ్రి లేడని తెలిపాడు. వస్త్ర పరిశ్రమలో పని చేసే సమయంలో ఐఎస్ఐతో సంబంధం ఉన్న ఓ కుర్రాడితో తనకు పరిచయం ఏర్పడిందని డబ్బుకు ఆశపడి అతనితో కలిసి లష్కరే లో చేరానని చెప్పాడు. ముజఫరాబాద్ లోని లష్కరే క్యాంపులో శిక్షణ ఇచ్చారని శిక్షణ సమయంలో తనకు 20 వేలు ఇచ్చారని తెలిపాడు. శిక్షణ తర్వాత రూ. 30 వేలు ఇస్తామన్నారని తెలిపాడు. శిక్షణ పూర్తయిన తర్వాత తనను పాక్ సైన్యం వద్దకు తీసుకెళ్లారని.. వారి ఆదేశాల మేరకు తాను, మరి కొందరు భారత్ లో చొరబడేందుకు యత్నించామని తెలిపాడు. జిహాద్ కోసం లష్కర్ పేదలను మరియు అనాథలను సిద్ధం చేస్తోందని అతడు తెలిపాడు. కాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ అణచివేయబడ్డారని శిక్షణ సమయంలోతనకు చెప్పారని.. కానీ ఇక్కడ ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించాడు. ఇండియన్ ఆర్మీ నన్ను బాగా చూసుకుంది.. ఆర్మీ తనకు అందించిన టీ కూడా బాగుందని అలీ బాబర్ చెప్పుకొచ్చాడు.

    ఇండియన్ ఆర్మీ ప్రకటన:

    19 ఏళ్ల లష్కర్ ఉగ్రవాది అలీ బాబర్ పాత్రను ఆర్మీ అరెస్టు చేసినట్లు మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్ తెలిపారు. అలీ బాబర్ ఉగ్రవాదిగా మారడానికి 3 నెలల పాటు లష్కర్ దగ్గర శిక్షణ పొందాడు. భారత్ లోకి చొరబడి ఉరి వంటి దాడిని చేయాలని భావించారు తీవ్రవాదులు. లొంగిపోవాలని ఉగ్రవాదిని అడిగినట్లు మేజర్ వత్స్ తెలిపారు. సెప్టెంబర్ 18 న చొరబడటానికి ప్రయత్నించగా.. ఆరుగురు ఉగ్రవాదులలో నలుగురు వెనక్కి పరుగెత్తారు.. కానీ ఇద్దరు ఎట్టకేలకు చొరబడ్డారు. సెప్టెంబర్ 26 న ఒక ఉగ్రవాది హతమయ్యాడు, కానీ రెండోవాడు లొంగిపోయాడు.

    Trending Stories

    Related Stories