National

అవమానాలు భరించలేను.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా..?

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజులుగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు కాంగ్రెస్ చీఫ్ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. నవజోత్‌ సింగ్ సిద్ధూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ విబేధాల కారణంగా అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా అమరీందర్ సింగ్ తాను ముఖ్యమంత్రి కొనసాగలేనంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు సమాచారం. ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని , ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సిద్ధూ శనివారం సాయంత్రం సీఎల్‌పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నాయకత్వ మార్పుపై ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని నెలలే ఉన్న సందర్బంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఈ సమావేశం తెరలేపింది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అదిష్టానంతో నేరుగా తన బాధ చెప్పుకున్నట్లు తెలిసింది. ‘ఇంతటి అవమానాన్ని నేను భరించలేను. ఈ అవమానాలు ఇక చాలు. ఇది మూడోసారి. ఇలాంటి అవమానాలతో నేను పార్టీలో ఉండాలనుకోవడం లేదు’ అని సోనియా గాంధీతో చెప్పినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ నాయకులు కొత్త నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. సునీల్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించనున్నారనే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

పంజాబ్‌లో కొంతకాలంగా సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంపై సొంతపార్టీ నుంచే విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నవ్‌జోత్ సింగ్ సిద్దూ నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీరిరువురి మధ్య వైరం పతాకస్థాయికి చేరింది. ఇరువురూ అదిష్టానంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కావాలని డిమాండ్ చేశారు సిద్ధూ. అధిష్టానం చొరవ తీసుకుని సిద్దూను శాంతింపజేశాయి. పంజాబ్ కాంగ్రెస్ విభాగానికి చీఫ్ పదవి ఇచ్చినా కూడా వివాదాలకు ఫుల్ స్టాప్ పడలేదు.

తాజా పరిణామాలతో అమరీందర్‌ సింగ్‌ అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈరోజు సాయంత్రం పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశమై అమరీందర్‌ వారసుణ్ని ఎన్నుకోనున్నట్లు సమాచారం. పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ అర్ధరాత్రి సమయంలో ట్వీట్‌ చేశారు. అత్యవసర శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నామని.. ప్రతిఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ సైతం ప్రతిఒక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించారు.

Related Articles

Back to top button