పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర సీఎంగా వైదొలిగిన 45 రోజుల తర్వాత మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాస్తూ తన మనస్సును పార్టీ గాయ పరిచిందని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీకి ఏడు పేజీల రాజీనామా లేఖను పంపారు.
కెప్టెన్ అమరిందర్ సింగ్ మరోసారి పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై నిప్పులు చెరిగారు. సిద్ధూలో నిలకడ లేదని అమరిందర్ సింగ్ అన్నారు. సిద్ధూకు పాకిస్థాన్‌తో లింక్‌లు ఉన్నాయని ఆరోపించారు. కానీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్రమ ఇసుక మైనింగ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. వారి వివరాలు బయటపెడతానని వెల్లడించారు. తాను ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే చిక్కులు తప్పవని చెప్పారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూతో మరియు పార్టీ ఎమ్మెల్యేలలోని ఒక వర్గంతో జరిగిన గొడవల తర్వాత అమరిందర్ సింగ్ సెప్టెంబర్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగారు. పార్టీ తనను అవమానించిందని అన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న అమరిందర్ సింగ్ సిద్ధూను పార్టీ ఎంకరేజ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఎప్పటికైనా అతడితో ప్రమాదం పొంచి ఉందని అన్నారు. తన నిష్క్రమణకు దారితీసిన లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి సంబంధించి కూడా వివరించారు.
ఇక ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో తన కొత్త పార్టీ ఉండబోతోందని కెప్టెన్ తెలిపారు. ఈ పేరుకు ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలుపలేదని, త్వరలోనే పార్టీని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. పార్టీ గుర్తు, విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.