పంజాబ్ కు వెళ్లనున్న ప్రధాని మోదీ, అమిత్ షా

0
884

పాటియాలాలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో పంజాబ్‌కు రానున్నారని తెలిపారు. ఫిరోజ్‌పూర్‌లో ఒక ర్యాలీలో ప్రసంగించేందుకు వెళుతున్న సమయంలో ప్రధాని భద్రతకు భంగం కలిగించిన ఒక నెల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. పంజాబ్, దేశ ప్రయోజనాల దృష్ట్యా PLC-BJP-SAD ఆధ్వర్యంలో సంయుక్త్ సంకీర్ణం ఏర్పడిందని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం సరిగా ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. పంజాబ్ రూ.70,000 కోట్ల అప్పుల్లో కొట్టుమిట్టాడుతోందని, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కేవలం 111 రోజుల్లో రూ.33,000 కోట్లు అప్పులు జోడించారని ఆయన విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని బలవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ విధ్వంసానికి పాల్పడిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భద్రత కోసం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను అమలు చేస్తామని వివరించారు. పాటియాలా ప్రాంతంలో తాను ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చన్నీ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. తన హయాంలో 22 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించామని, రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకుని వచ్చామని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పంజాబ్ మనుగడ కోసం రాష్ట్రం, కేంద్రం కలిసి పనిచేయాలన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి తనకు సత్సంబంధాలు ఉన్నాయని అమరీందర్ అన్నారు.

ప్రతిరోజూ భారతీయులను చంపాలని తన బలగాలకు ఆదేశాలు ఇస్తున్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ని నవజ్యోత్ సింగ్ సిద్ధూ కౌగిలించుకోవడంపై అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను ప్రమాదంలో పడేసే వ్యక్తులకు రాష్ట్ర పాలనను అప్పగించలేమని ఆయన అన్నారు. “మీరు ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తారు? కాల్పులు జరిపే సైనికులా లేక ఆర్డర్ ఇచ్చేవారా?” అమరీందర్ బహిరంగ సభలో పాటియాలా ప్రజలను అడిగారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను మంత్రివర్గం నుండి తొలగించిన తరువాత తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను అభ్యర్థించినట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేసినట్లు ఆయన చెప్పారు.

“మేము పాకిస్తాన్‌తో శాంతిని కోరుకుంటున్నాము కానీ వారికి తలవంచము. మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము, మా సైన్యం వారిని ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, ”అని అమరీందర్ చెప్పారు, సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో అత్యున్నత స్థాయి భద్రత ఈ సమయంలో అవసరమని, ఇది PLC కూటమికి మాత్రమే సాధ్యమని అన్నారు. పాటియాలా అర్బన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు అమరీందర్ సింగ్. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.