More

    బ్రేకులు లేని బుల్డోజర్లు.. సుప్రీంకోర్టు పచ్చజెండా..!

    యూపీలోనే కాదు దేశంలో ఎక్కడా బుల్డోజర్లకు ఎదురులేకుండా పోయింది. ఉత్తర ప్రదేశ్‌లో రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్‌తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. తాము కేవలం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పగలమని తెలిపింది.

    జామియా ఉలేమా ఈ హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత చట్ట ప్రకారం జరగాలని, ప్రతీకార ధోరణి ఉండకూడదని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పందించాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రయాగ్‌రాజ్, కాన్పూరు పురపాలక సంఘాలకు నోటీసులు ఇచ్చింది. ప్రతి అంశం నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలని తెలిపింది. అధికారులు చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపింది. భద్రతకు భరోసా ఉండే విధంగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

    ఇదిలావుండగా, కూల్చివేతలను నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము కూల్చివేతలను నిలిపేయలేమని, కేవలం చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే తాము చెప్పగలమని న్యాయమూర్తులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో చట్టవిరుద్ధంగా ఇళ్ళను కూల్చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ ఈ పిటిషన్‌ను జామియా ఉలేమా ఈ హింద్ దాఖలు చేసింది. అక్రమ కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టపరమైన సముచిత ప్రక్రియను అనుసరించకుండా ఇకపై ఎటువంటి కూల్చివేతలు ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ పొందాలని కోరింది.

    బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో చాలా చోట్ల ముస్లింలు హింసాత్మక నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే 300కు పైగా నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితులకు సంబంధించి వారి అక్రమ ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది ప్రభుత్వం. ప్రయాగ్‌రాజ్, కాన్పూరు పురపాలక సంఘాలు నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి. ఇదిలావుండగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఏ మతస్థులనూ లక్ష్యంగా చేసుకోలేదని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రయాగ్‌రాజ్, కాన్పూరులలో జరిగిన కూల్చివేతల సంఘటనల్లో చట్టపరమైన సముచిత ప్రక్రియను అనుసరించినట్లు తెలిపింది. ముందుగా నోటీసులు ఇచ్చి, ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించింది.

    యూపీ ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. యూపీలో సరైన ప్రక్రియలోనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆయన సుప్రీంకు తెలిపారు. ఢిల్లీ జహంగీర్ పురి ప్రాంతంలో ఏ వర్గానికి చెందని ఆస్తి ఉందో చూడకుండా నిర్మాణాలను తొలగించారని..ఇటువంటి కూల్చివేతలు సరైన ప్రక్రియలోనే సాగుతున్నాయని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో పిటిషనర్ల తరుపున వాదిస్తున్న సీయూ సింగ్.. కూల్చివేతలకు ముందు 15-40 రోజుల డెడ్ లైన్ ఉండాలని, కూల్చివేతలకు ముందు నోటీసులు అందించాలని సుప్రీంను కోరారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆరోపించారు.

    spot_img

    Trending Stories

    Related Stories