పెద్ద డ్రామాకు తెరలేపిన జస్టిన్ ట్రూడో..!

0
148

న్యూఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా హాజరైన నేతలలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఉన్నారు. ఆయన భారతదేశంలో అడుగుపెట్టినప్పటి నుండి దేశం విడిచి వెళ్లే సమయం వరకూ హైడ్రామా నడిపించారు. ఆయన సెక్యూరిటీ కోసం భారత్ లోని అధికారులు చాలా ఏర్పాట్లు చేసినా అవి తనకు వద్దు అంటూ చెప్పారు. పొరపాటున చిన్న సంఘటన చోటు చేసుకున్నా భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నదే జస్టిన్ ట్రూడో ప్లాన్ అని స్పష్టంగా తెలుస్తోంది.

జస్టిన్ ట్రూడో భారతదేశంలో G20 సమ్మిట్ సందర్భంగా న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఉండటానికి నిరాకరించారు. ఆయన టీమ్ చేసిన పనుల కారణంగా.. భారత ఇంటెలిజెన్స్ అధికారులలో ఆందోళనలు ఎక్కువయ్యాయి. న్యూఢిల్లీలోని హోటల్ లలిత్ లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేశారు. అయితే ఒక్క రోజు కూడా ట్రూడో ప్రెసిడెన్షియల్ సూట్‌ను ఉపయోగించలేదు. హోటల్‌లోని సాధారణ గదిలో బస చేశారు. ఆయన భద్రత విషయంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులలో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర వర్గాలు తెలిపాయి.

సెంట్రల్ ఢిల్లీలోని లలిత్ హోటల్‌లో జస్టిన్ ట్రూడో బస చేశారు. వారి భద్రతకు సంబంధించి భారత బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. స్నైపర్ బుల్లెట్‌లను కూడా ఆపగల మందపాటి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ పొరతో కూడిన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కూడిన అధునాతన భద్రతా షీల్డ్‌ను ఏర్పాటు చేసినట్లు భద్రతా సంస్థ వర్గాలు తెలిపాయి. ఇతర భద్రతా పరికరాలను కూడా ఆయన సెక్యూరిటీ కోసం ఉంచారు. కానీ వాటిని పట్టించుకోలేదు. ఈ విషయం గురించి బయటకు చెప్పలేదు. కానీ ట్రూడో ఉన్న సమయంలో మన ఇంటెలిజెన్స్ అధికారులను చాలానే టెన్షన్ పెట్టారు. విదేశీ అతిథుల భద్రత కోసం కేంద్ర పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఢిల్లీ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. అన్ని భద్రతా సంస్థల కమాండోలకు వేర్వేరు బాధ్యతలు అప్పగించారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు హోం మంత్రిత్వ శాఖ పలు సమావేశాలు నిర్వహించింది. జీ20 ప్రతినిధుల భద్రత కోసం యాభై మంది సీఆర్పీఎఫ్ గార్డులను నియమించారు. గ్రేటర్ నోయిడాలోని విఐపి సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్‌లో సిఆర్‌పిఎఫ్ 1,000 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని భద్రత కోసం రంగంలోకి దింపింది.

ఇక జీ20 సదస్సు ముగిశాక భారత్ నుండి కెనడాకు వెళ్లే సమయంలో కూడా హై డ్రామా నడిచింది. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేశారు. సుమారు 36 గంటల నిరీక్షణ తర్వాత తిరిగి కెనడాకు వెళ్లారు. కెన‌డా నుంచి ట్రూడో కోసం బ‌య‌లుదేరిన బ్యాక‌ప్ విమానాన్ని లండ‌న్‌కు దారిమ‌ళ్లించారు. అయితే ఈ విమానాన్ని ఎందుకు దారిమ‌ళ్లించార‌నే వివ‌రాలు చెప్పలేదు. భారత్ ట్రూడోకు విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా తిరస్కరించారు.

న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు నిజ్జార్‌ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చానని ట్రూడో చెప్పారు. ప్రధాని మోదీ సైతం ఖలిస్తానీ వాదుల ఆగడాలపై ఆయనను ప్రశ్నించారు. ట్రూడో కు మోదీ క్లాస్ తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే
భారత్‌ను రెచ్చగొట్టాలని తాము చూడటం లేదని జస్టిన్ ట్రూడో అన్నారు. భారత్‌ను రెచ్చగొట్టాలని లేదా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదన్నారు. కానీ సిక్కు నేత హత్యను మాత్రం తీవ్రంగా పరిగణించాలని తాము భారత్‌ను కోరుతున్నామన్నారు. ప్రతి విషయంలో స్పష్టంగానే ఉన్నామని.. భారత్‌తో కలిసే పని చేయాలని కోరుకుంటున్నట్లు ట్రూడో భారత్ ఆగ్రహాన్ని చవి చవిచూశాక స్టేట్మెంట్స్ ఇచ్చారు.