వెనక్కి తగ్గిన కెనడా.. భారత్ తో కలసి పనిచేస్తానంటూ వేడుకోలు..!

0
219

ఖలీస్థాన్ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధానికి కారణమైంది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఐక్యరాజ్యసమితి వేదికగా కూడా ట్రూడో మాట్లాడుతూ.. తమ దేశం అంతర్జాతీయ నిబంధనలు, విధానాలకు కట్టుబడి ఉందని అన్నారు. ఖలిస్థానీ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని.. అందుకు విశ్వసనీయమైన కారణాలు కూడా ఉన్నాయని అన్నారు.

ఇక శుక్రవారం నాడు కూడా ట్రూడో అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను మాట్లాడిన విషయాన్ని కొన్ని వారాల ముందే భారత్ కు సమాచారం అందించామని అన్నారు. భారత్ తో కలసి నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. భారత్ మాతో కలసి పనిచేస్తుందని భావిస్తున్నామని.. అప్పుడు ఈ అంశంలో మరింత ముందుకు వెళ్లొచ్చని ట్రూడో తెలిపారు. కెనడా ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘అవును ఈ ఆరోపణలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధాని మోదీతో మాట్లాడారు.. ప్రధాని వాటిని తిరస్కరించారు’ అని పేర్కొంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చినప్పుడు జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ తిరస్కరించారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను జస్టిన్ ట్రూడో కెనడియన్ పౌరుడిగా చెబుతున్నారు. ఇటీవల తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు ట్రూడో ప్రకటించారు. తాము భారత్‌ను రెచ్చగొట్టడం లేదని అంటూనే.. ఈ హత్య కేసు విచారణలో భారత్ సహకారం కావాలని కోరారు జస్టిన్ ట్రూడో. కెనడా పౌరులను సురక్షితంగా ఉంచాలని తమ ప్రభుత్వం చూస్తోందని, నిజ్జర్ హత్య కేసును సీరియస్‌గా తీసుకోవాలని భారత్‌కు ట్రూడో సూచించారు. కెనడాకు స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన ప్రక్రియ ఉన్నాయని తాము దాన్ని అనుసరిస్తామని చెప్పారు. భారత్ ప్రాముఖ్యత గల దేశం అనడంలో ఎలాంటి సందేహం లేదని.. తాము ఒక రీజియన్ లోనే కాకుండా ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ట్రూడో స్పష్టం చేశారు.