More

  జీవితాంతం.. జిన్‎పింగేనా..? కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో ఏం జరగబోతోంది..?

  మన ప్రపంచంలో.. రెండు ప్రపంచాలున్నాయి..! ఒకటి మనందరి ప్రపంచం. రెండోది చైనా దేశం లోపలి కమ్యూనిస్టుల సీక్రెట్ వరల్డ్..! భూమ్మీది అతి పెద్ద దేశాల్లో ఒకటైన చైనా, అత్యధిక జనాభా ఉన్నప్పటికీ అత్యంత గుట్టుగా తన అంతర్గత ప్రపంచాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడే కాదు.. చైనా అంటే ఏంటో చరిత్రలోనూ ఎవరికీ పెద్దగా తెలియదు. భారత్‎తో సహా ఆసియాలోని మిగతా దేశాలు, యూరప్, ఆఫ్రికా ఖండాలు వేల సంవత్సరాలుగా ఏదో ఒక విధంగా కలిసే ఉన్నాయి. కానీ, మన పక్కనే ఉండే చైనా మాత్రం ఎవరికీ అంతగా అంతుబట్టదు. మరే దేశంతోనూ డ్రాగన్‎కు ఏమంతగా రాకపోకలు ఉన్నట్టు కనిపించదు. ఒక విధంగా అందుకే.. చైనా మనలాగా దండయాత్రలకి, వలసవాద తెల్ల దొరల దోపిడీకి గురికాలేదు. అయితే, కొద్ది కాలం విదేశీ శక్తుల ఆధిపత్యానికి లోనైనా కూడా వెంటనే తేరుకుని మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు సమాజంగా రూపుదిద్దుకుంది. చరిత్రలో నమోదు కానీ ఎన్నెన్నో రక్తపాతాల మీదుగా నేడున్న స్థాయికి డ్రాగన్ ఎగబాకింది.

  1949లో కమ్యూనిస్టు చైనాగా మారిన రిపబ్లిక్ ఆఫ్ చైనా మరింత, మరింత మార్మికంగా మారిపోతూ వచ్చింది. ప్రస్తుతం షీ జిన్ పింగ్ పగ్గాలు చేపట్టి ముందుకు దూకిస్తోన్న ప్రపంచపు రెండవ అతి పెద్ద ఆర్దిక వ్యవస్థ ఏ విషయంలోనూ అంత తేలిగ్గా బయటపడదు. బయటి ప్రపంచంలో వినిపించేవన్నీ దాదాపూ ప్రచారాలు, పుకార్లు మాత్రమే. చైనా లోపల ఏం జరుగుతుందో మనకు ఎవ్వరికీ తెలిసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే, డ్రాగన్ అధికారికంగా చేసే ప్రకటనలు చాలా తక్కువ. ఒకవేళ ఆ దేశ అధికారులు, మీడియా ఏదైనా చెప్పినా కూడా.. మనం గుడ్డిగా నమ్మటానికైతే ఉండదు. అంతగా అసత్యాలకు పెట్టింది పేరు.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా..!

  అత్యంత రహస్యంగా తన అంతర్గత వ్యవహారాలు నడిపే బీజింగ్ ఇప్పుడు మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. డ్రాగన్ కంట్రీకి కొత్త ప్రెసిడెంట్ వస్తాడా..? జిన్‎పింగ్ మూడోసారి అధికార పీఠం అధిష్టిస్తాడా..? ప్రస్తుతం అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. అక్టోబర్ 16, ఆదివారం నాడు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. రెండు వేల మందికి పైగా ప్రతినిధులు దేశం నలుమూలల నుంచీ బీజింగ్‎కి వస్తారు. వారు తమ కొత్త నాయకుడ్ని ఎన్నుకుంటారు..! కానీ, చాలా మంది అంతర్జాతీయ రాజకీయ పండితుల విశ్లేషణ ఏంటంటే.. రాబోయేది కొత్త నాయకుడు కాదట. జిన్‎పింగే సరికొత్తగా రణరంగంలోకి దిగబోతున్నాడట..!

  చైనా ప్రస్తుత అధ్యక్షుడు జిన్‎పింగ్ 2012లో తన శకాన్ని ప్రారంభించాడు. అంటే దశాబ్దం కిందట ఆయన పాలన మొదలైందన్నమాట. చైనాలోని ప్రస్తుత నియమ, నిబంధనల ప్రకారం ఏ నాయకుడు కూడా పదేళ్ల కంటే ఎక్కువ కాలం దేశాధ్యక్షుడుగా కొనసాగటానికి వీల్లేదు. అంతేకాదు, అయిదేళ్ల చొప్పున రెండుమార్లు ఎన్నికైన వ్యక్తి మూడోసారి పోటికి కూడా అనర్హుడు. కానీ, ఈ రూల్స్ అన్నీ తిరగరాసే ప్రయత్నంలో ఉన్నాడు జిన్‎పింగ్. ఆయనని మూడోసారి చైనీస్ ప్రెసిడెంట్‎గా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు ఎన్నుకోవటం లాంఛనమేనంటున్నారు పరిశీలకులు.

  జిన్‎పింగ్ కంటే ముందు.. పదేళ్ల కంటే ఎక్కువ కాలం, మూడు దఫాలు దేశాధినేతగా కొనసాగిన వాడు మావో జెడాంగ్ మాత్రమే. ఆయన నేతృత్వంలోనే డ్రాగన్ కమ్యూనిస్టు కంట్రీగా మారిపోవటంతో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చైర్మన్‎ని ధిక్కరించేవారు లేకపోయారు. దాంతో అప్రతిహతంగా సాగిన మావో పాలన అనేక విజయాలు సాధించి పెడితే.. ఆ క్రమంలో అనేక అవాంఛనీయ పరిణామాల్ని కూడా చైనీయులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా, ఒకే వ్యక్తి చేతిలో అదికారం కేంద్రకృతం కావటంతో నియంతృత్వం తప్పలేదు. వ్యవసాయం నుంచీ పారిశ్రామీకికరణ దిశగా జనాన్ని బలవంతంగా మరల్చటం. కల్చరల్ రెవల్యూషన్ పేరుతో అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం దశాబ్దాల పాటూ జరిగింది. చివరకు, మావో మరణం నాటికి చైనా దివాలా దిశగా ప్రయాణం మొదలు పెట్టేసింది.

  కమ్యూనిస్టు చైనా తొలి అధ్యక్షుడి నియంతృత్వ పాలన తరువాత ముగ్గురు ప్రెసిడెంట్స్ మారారు. డెంగ్ జియావోపింగ్, జియాంగ్ జెమిన్, హు జింటావ్ పదేళ్లకు మించి పరిపాలించలేదు. ఎవ్వరూ మూడో టర్మ్ కోసం ప్రయత్నాలు చేయలేదు. అంతే కాదు, డిక్టేటర్ షిప్ అమలు చేయలేదు. జిన్‎పింగ్ ఇప్పుడు నవయుగ మావోగా మారి అన్నీ చేయాలని సంకల్పించుకున్నాడు. పదేళ్లుగా ప్రభుత్వంపై, దేశంపై, పార్టీపై తన పట్టు బిగించాడు. జీవిత కాల అధ్యక్షుడిగా ఉండిపోవటానికి దాదాపుగా అన్ని ఎత్తులు, పైఎత్తులు వేసేశాడు. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ లో…ఆదివారం ఓటింగ్ లో పాల్గొనబోయే 2 వేల మంది ఇంచుమించూ ఆయనకు పరమ విధేయులే! అందుకే, జిన్ పింగ్ మూడో రాకడ పెద్ద ఆశ్చర్యమేం కాదంటున్నారు విశ్లేషకులు..!

  పదేళ్ల కంటే ఎక్కువకాలం సీటు‎పై కూర్చోవటం.. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావటం.. మావోకి, జిన్‎పింగ్‎కి ఉన్న సామ్యాలు. కానీ, ఆ పోలికలు అక్కడితో ఆగలేదు. విస్తర్ణ వాదంలోనూ, యుద్ధ కాంక్షలోనూ, నియంతృత్వ విధానాల్లోనూ జెడాంగ్‎తో సరిగ్గా సరితూగుతాడు జిన్‎పింగ్. అప్పట్లో లాంగ్ మార్చ్ పేరుతో మావో అనేక పోరాటాలకు సిద్ధపడ్డాడు. అలాగే, నేటి ఆధునిక చైనా మ్యాపుకు రూపం ఇచ్చింది కూడా ఆయనే. మావో కాలంలో ఎందరో చైనీయులు రక్తసిక్త పోరాటాల్లో, యుద్ధాల్లో మరణించారు. జిన్ పింగ్ కూడా ప్రస్తుతం మూడో దఫా అధ్యక్షుడైతే తైవాన్‎ను సంపూర్ణంగా చైనాలో విలీనం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఆ విషయంలో అమెరికాతో కయ్యానికి కూడా సై అంటున్నాడు. డ్రాగన్ దేశంలో ఆర్దిక సంక్షోభం అలముకోవటం, అధ్యక్ష పదవికి ఎన్నికలు ముసురుకు రావటంతో జిన్‎పింగ్ కాస్త వెనక్కి తగ్గాడు. తాను మరోసారి ప్రెసిడెంట్ అయితే మాత్రం ఏ క్షణాన్నైనా తైవాన్ పై మిసైల్స్‎తో విరుచుకుపడవచ్చు..!

  బ్రిటన్ పాలనలో హాంకాంగ్ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని అనుభవించింది. అది ఇప్పుడు చైనా ఆధీనంలో ఉంది. చైనా పాలకులు హాంకాంగ్‎కి అనేక హామీలు ఇచ్చి దేశంలో కలుపుకున్నారు. కానీ, జిన్‎పింగ్ అన్నిట్నీ తుంగలో తొక్కి హాంకాంగ్‎లో ప్రజాస్వామ్యం మచ్చుకి కూడా లేకుండా చేశాడు. చైనా బలగాలు హాంకాంగ్ శాంతియుత నిరసనల్ని, ఉద్యమాల్ని ఉక్కుపాదాలతో అణిచివేశాయి. ఇక జిన్‎పింగ్ వ్యవహారం ఇండియాతో ఎలా ఉందో మనకు తెలిసిందే కదా..? గల్వాన్ వ్యాలీలో అకారణ హింసకు తెగబడింది చైనీస్ ఆర్మీ. భారతీయ సైన్యం దీటుగా బదులు ఇవ్వటంతో ఇరువైపులా ప్రాణ నష్టం తప్పలేదు. జిన్‎పింగ్ సారథ్యంలోని చైనాకు ఇటువంటి కవ్వింపులు, కయ్యాలు నిత్యాకృత్యాలు. అవే చైనాలోని కొన్ని వర్గాలకి, ప్రపంచానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మావో తరువాతి కాలపు చైనా అధ్యక్షులు కాస్త ఉదారంగా ప్రవర్తించారు. తత్ఫలితంగా చైనాలో కార్పొరేట్లు అమాంతం పైపైకి ఎదిగారు. జిన్‎పింగ్ కాలంలో అత్యధిక భాగం బడా వ్యాపారవేత్తలకు ప్రతికూలంగానే సమయం సాగింది. అలీ బాబా లాంటి మల్టీనేషనల్ కంపెనీకి యజమాని అయిన జాక్ మా అనూహ్యంగా అదృశ్యమైపోయాడు. ఆయన ప్రాణాలతో తిరిగి వస్తాడనీ నమ్మిన వాళ్లు చాలా తక్కువ మంది. కేవలం జాక్ మానే కాదు జిన్‎పింగ్‎ను వ్యతిరేకించిన, వ్యతిరేకించే అవకాశం ఉన్న ఎవరైనా అదృశ్యం అవ్వాల్సిందే. అదృష్టం ఉంటే తప్ప ప్రాణాలతో వాళ్లెవరూ తిరిగిరారు. అలా సాగింది జిన్ పింగ్ పదేళ్ల శకం..!

  ప్రపంచానికి కరోనాను అంటగట్టిన చైనాలో జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది కూడా జిన్‎పింగే..! ఒక్క కోవిడ్ కేసు నమోదైనా లాక్‎డౌన్ అంటూ కర్కశంగా వ్యవహరిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. దాని ప్రజల జీవితాలు నరకంగా మారాయి. వారు మానసికంగా, ఆర్దికంగా చితికిపోతున్నారు. అందుకే, జిన్‎పింగ్ డిక్టేటర్ అంటూ బీజింగ్ లో బ్యానర్లు వెలిశాయి..! కమ్యూనిస్టు చైనాలో పార్టీ చైర్మన్‎ని విమర్శిస్తూ బ్యానర్‎లు కట్టటం అతి పెద్ద సాహసం..! ప్రాణాలకు తెగించి ఆ పని ఎవరో చేశారో తేల్చే పనిలో ప్రస్తుతం చైనీస్ పోలీసులు ఉన్నారు. కానీ, ఎప్పుడూ లేనిది దేశాధ్యక్షుడి పేరుతో నిరసనలు రావటం కొట్టిపారేయాల్సిన చిన్న విషయం కాదు. చైనాలో లోలోన రాజుకుంటోన్న ఓ దావానలానికి అది చిరు సంకేతం కావచ్చు..!

  కొన్నాళ్ల క్రితం జిన్‎పింగ్ కనిపించటం లేదని సొషల్ మీడియాలో హడావిడి జరిగింది. అతడ్ని హౌజ్ అరెస్ట్ చేశారని ప్రచారం కూడా మొదలైపోయింది. అయితే, అవన్నీ ఒట్టి మాటలేనని దాదాపుగా తేలిపోయింది. అక్టోబర్ 16, ఆదివారం నాడు కీలకమైన ఎన్నిక సమీపిస్తుండటంతో… జిన్ పింగ్ రేసులోనే ఉన్నాడని నిర్ధారణ అవుతోంది. ఆయనే చైనా అధ్యక్షుడని అధికారిక వార్త రావటమే ఇక తరువాయి. అయితే, అత్యంత గోప్యంగా కొనసాగే చైనాలో ఏ క్షణం, ఏమైనా జరగవచ్చు. ప్రపంచం మొత్తంతో పాటూ మనమూ వేచి చూద్దాం! జిన్ పింగ్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటాడా..? కొత్త ప్రెసిడెంట్ ‘ఎంటర్ ది డ్రాగన్’ అని ఆశ్చర్యపరుస్తాడా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..

  Trending Stories

  Related Stories