More

  కాంగ్రెస్‎లోకి పీకే..?!
  రాహుల్ బ్రెయిన్ స్టార్మింగ్..!

  జనాన్ని నమ్మించి ఎన్నికల్లో గెలవడం ఎలా..? అనే అంశంలో పీహెచ్డీలు చేసిన పీకే.. ఇప్పుడు తానే రాజకీయ రంగంలోకి దిగుతున్నాడు. 2024 ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు బీజేయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  లోక్ సభ ఎన్నికలకు రెండేళ్లే టైం వుంది. ఇప్పటికే పార్టీలన్నీ వ్యూహరచనల్లో బిజీ అయిపోయాయి. ముఖ్యంగా అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయి. వరుస సమావేశాలు, కీలక నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించే పరిణామాలు రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. దెబ్బల మీద దెబ్బలు పడుతున్న కాంగ్రెస్ మళ్లీ పూర్వస్థితికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రశాంత్ కిశోర్.. వ్యూహాలకు పదును పెడుతున్నాడు. అయితే, పార్టీ బయటి నుంచి కాకుండా.. పార్టీలో చేరి.. చెమటోడ్చాలని సంకల్పించినట్టు తెలుస్తోంది.

  ఇందులో భాగంగా.. ఇటీవలే ఆయన కాంగ్రెస్ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక సమావేశమయ్యాడు. ఆ సమావేశంలోపంజాబ్, యూపీ శాసనసభ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగిట్టు వార్తలొచ్చాయి. నిజానికి, ప్రధానాంశం అది కాదని.. కాంగ్రెస్ లో పీకే చేరికపై తీవ్రమైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్‌ను సోనియా, రాహుల్ గాంధీలో పార్టీలోకి ఆహ్వానించారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే, తనను పార్టీ ఆహ్వానించడం కాదని.. తానే పార్టీలో చేరుతున్నాడని వార్తాకథనాలు వెలువడుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా తన కెరీర్ ముగించి.. రాజకీయ అరంగేట్రం చేయబోతోన్నట్టు కొన్నాళ్ల క్రితమే ప్రశాంత్ కిశోర్ ప్రకటించాడు. అయితే, అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మళ్లీ వ్యూహకర్త అవతారం ఎత్తి.. దీదీకి తన అండదండలు అందించాడు. ఇక, కార్యచరణకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ ఒక ప్లాన్ రూపొందించాడు. అయితే, ప్లాన్ లో తాను కూడా పాత్రదారిగా మారిపోతున్నాడు.

  ఇదిలావుంటే, పీకేను పార్టీలో చేర్చుకోవాలా..? వద్దా..? అనే అంశంపై రాహుల్ గాంధీ మల్లగుల్లాలు పడుతున్నాడట. ఇదే అంశంపై పార్టీలో సీనియర్ నేతలతో చర్చోపచర్చలు జరుపుతున్నాడు. ఈ చర్చల్లో పాల్గొన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి తీసుకొచ్చే అంశంపై చర్చ జరిగింది వాస్తవమేనని చెప్పాడు. పీకే కాంగ్రెస్ వెలుపల ఉండి పార్టీ కోసం పనిచేయడం కంటే.. పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే అంశంపై రాహుల్ చర్చించినట్టు తెలిపాడు. పీకే చేరిక కాంగ్రెస్‌కు మేలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమైందన్నాడు. అయితే పార్టీలో అతను పోషించబోయే పాత్రను నిర్వచించాలని.. దానికి షరతులు కూడా ఉండాలని పీకే తన పలు డిమాండ్లను పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టు తెలుస్తోంది.

  ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నేత మాట్లాడుతూ.. ప్రశాంత్ కిశోర్ పార్టీలోకి తీసుకురావడం వల్ల నష్టమేమీ ఉండదన్నాడు. ఇది సరికొత్త ఆలోచనలు, వ్యూహాలను తీసుకురావాల్సిన సమయమని అభిప్రాయపడ్డాడు. పీకే సామర్థ్యం పార్టీకి ఎంతమేర ఉపయోగపడుతుందో చర్చించవచ్చన్నాడు. పార్టీ బాగు కోసం మార్పును స్వీకరించేందుకు సిద్దంగా ఉండాలన్నాడు.

  ఇప్పటికైతే పీకే నుంచి గానీ కాంగ్రెస్ వైపు నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం ఆయన కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీని.. రెండు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే విజయానికి సహాయ సహకారాలు అందించిన పీకే.. ఓవైపు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీకి ఫుల్ టైమ్ వ్యూహకర్తగా పనిచేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

  ఇప్పటివరకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగానే వున్నాడు. ఓసారి జేడీయూలో చేరినా.. అక్కడ ఇమడలేకపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అసలే గాంధీ కుటుంబ పెత్తనం, మరోవైపు కుట్ర రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. అలాంటి కుట్రపూరిత వాతావరణంలో తన వ్యూహాలు పనిచేస్తాయా..? ఇవన్నీ ఎదుర్కొని ఆయన పార్టీలో మనగలడా..? ఒకవేళ పార్టీలో చేరితే ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతాడా..? కేవలం సలహాలు, వ్యూహాలకే పరిమితమవుతాడా..? అన్నది వేచి చూడాలి.

  Trending Stories

  Related Stories