More

  ఆ రెండు రాష్ట్రాల్లో.. ‘ఆప్’కి ఆపసోపాలేనా..?

  ఈ ఏడాది చివర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు చాలా వ్యక్తుల, పార్టీల రాజకీయ భవిష్యత్తుని తేల్చేయబోతున్నాయి. 1995 నుంచి ఏకఛత్రాధిపత్యంతో బీజేపీ గుజరాత్‎ని ఎలుతూ వస్తే.. ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ అన్నట్టుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు మారుతూ వచ్చాయి. అయితే ఇదివరకటి కంటే కాంగ్రెస్ ఇప్పుడు బాలహీనపడిన మాట వాస్తవం. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికే తాము వస్తున్నామని ప్రచారం చేయడం మొదలెట్టింది ఆప్. మొదట ఢిల్లీ, తర్వాత పంజాబ్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన ఆప్.. తర్వాత లక్ష్యాలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అనేసరికి.. ఈసారి రెండు రాష్ట్రాల ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని చాలా మంది ఊహించారు. కారణాలు ఏవైనా కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో కొంత వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు వదిలేసి, యువరాజు కర్ణాటక, కేరళ, తమిళనాడు లోనే చక్కర్లు కొడుతున్నాడు. దీంతో బీజేపీని లక్ష్యంగా చేసుకుని రెండు రాష్ట్రాల్లో ప్రచార వేడిని పెంచింది ఆప్. బీజేపీ కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ ఆప్‎నే లక్ష్యంగా చేసుకోవడం మొదలెట్టింది. దీంతో పోటీ ఆప్-బీజేపీ మధ్యే జరుగుతునట్టుగా అనిపించింది.

  అయితే సరిగ్గా ఇక్కడే కథ అద్దం తిరిగింది. దూకుడుగా వెళ్తున్న కేజ్రీవాల్‎కి మొదట సత్యేందర్ జైన్ అరెస్ట్ ద్వారా ఊహించని షాక్ తగిలింది. దీంతో కేజ్రీవాల్ కొంచెం నెమ్మదించడం మొదలెట్టారు. అప్పటివరకు రెండు రాష్ట్రాల మీద దృష్టి పెడుతూ వచ్చిన కేజ్రీవాల్, క్రమక్రమంగా కేవలం గుజరాత్ మీదే దృష్టి పెట్టడం మొదలెట్టారు. దాని తర్వాత లిక్కర్ స్కామ్, సిసోడియా మీద ఆరోపణలు.. కేజ్రీవాల్‎ను డైలమాలోకి నెట్టేశాయి. ఇలా కొండంత నమ్మకంతో రెండు రాష్ట్రాల్లో బరిలోకి దిగాలని భావించి కేజ్రీవాల్.. కనీసం గుజరాత్‎లోనైనా ప్రభావం చూపిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్‎ను ఎలుతూ వస్తున్న బీజేపీకి 2017లో షాక్ ఎదురైంది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా స్వల్ప ఆధిక్యంతో రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది కమలదళం. దీనిని దృష్టిలో పెట్టుకునే మళ్ళీ అలాంటి ప్రమాదం రాష్ట్రంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. అందుకే విజయ్ రూపాణిని తప్పించి భూపేందర్ పటేల్‎ని ముఖ్య మంత్రిని చేసింది. గుజరాత్ లో పటేల్ సామాజికవర్గం చాలా ప్రభావవంతమైనది. వీళ్ళు తమకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా కావాలని గతంలో ఎంతో తీవ్రంగా కూడా ఉద్యమించారు. దీనిని కొన్ని దుష్ట శక్తులు కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. 2017లో బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అని చెపొచ్చు. భూపేంద్ర పటేల్‎ను ముఖ్యమంత్రిని చేసి ప్రభావవంతమైన పటేళ్లను తమవైపు తిప్పుకున్నారనే వాదన కూడా ఉంది. అంతేకాదు, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిత్యం రాష్ట్రంలో పర్యటిస్తూ.. అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాతిరోజే మోదీ గుజరాత్‎లో పర్యటించి ఎన్నికల నగారా మోగించారు. అప్పటి నుంచి మోదీ, షా నిత్యం రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు. కమల దళం దూకుడు చూసి రాష్ట్రంలో మళ్ళీ కమలమే వికసించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

  బీజేపీ దూకుడు ఇలా ఉంటే, ఇక కాంగ్రెస్ తన గ్రౌండ్‎ను పూర్తిగా కేజ్రీవాల్‎కు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన కేజ్రీవాల్ ఆరంభలో హడావుడి చేశారు. అయితే వరుస ఎదురు దెబ్బలతో కేజ్రీవాల్ ప్రస్తుతం ఫ్రస్టేషన్‎లో ఉన్నాడు. ఎంత ఫ్రస్టేషన్‎లోకెళ్లాడంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే ఆర్థం కాలేనంతగా. మోదీ, షాలు సోనియా గాంధీని బ్యాక్‎డోర్ నుంచి దేశ ప్రధాని చేయాలని చూస్తున్నారట..! ఇదీ కట్టర్ ఇమాందార్ కేజ్రీవాల్ వ్యాఖ్య. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు.. గుజరాత్‎లో ఆప్‎కు ఓటమి తప్పదని చెప్పడానికి. మొదట ఆప్ మంత్రి రాజేంద్ర గౌతం హిందు ధర్మం నుంచి వేల మంది హిందువులను బౌద్ధ ధర్మం లోకి మార్చడం పెను దూమరనికి దారి తీసింది. ఇక్కడితో ఆగకుండా తాము రాముడు, కృష్ణుడిని పూజించమంటూ ప్రతిజ్ఞ చేయించడంతో కేజ్రీవాల్ ఆత్మరక్షన్లో పడ్డారు. అందుకే తనని కృష్ణుడు పంపించడాని కేజ్రీవాల్ చెప్పుకుంటున్నా.. ప్రభావం చూపలేదంటున్నారు విశ్లేషకులు. ఆ తర్వాత ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా మోదీని పరుష పదజాలంతో దూషించడం జనంలోకి నెగెటివ్‎గా వెళ్ళిందనే వాదన కూడా ఉంది. రాజకీయాల్లో తిట్టుకోవడం సర్వ సాధారణం. కానీ హద్దు మీరీ మోదీని తిట్టడం.. అక్కడితో ఆగకుండా గోపాల్.. మోదీ తల్లిగారిని దూషించడం.. ఆప్‎కి ఇబ్బందిగా మారే అవకాశాన్ని తీసిపారేయలేం. అంతేకాదు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ గోపాల్ ఇటాలియా గతంలో చేసిన మాటలు ఇప్పుడు నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఒక పక్కన ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడిని రాక్షసులతో పోలిస్తుంటే, మరోపక్క ఆప్ జాతీయ అధ్యక్షుడు తనని రాష్ట్రానికి కృష్ణుడే తీసుకువచ్చదని మాట్లాడితే, జనాలు నమ్ముతారా..?

  అయితే.. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఆప్ ఎంత హడావిడి చేసిన.. కాంగ్రెస్ ఎంత నెమ్మదించినా.. రాష్ట్రంలో పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యే ఉంటుందనేది కాదనలేని నిజం. సంస్థాగతంగా ఆప్ బలంగా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద బాలహీనత. కాంగ్రెస్ పెద్దగా ప్రచారం చేయకపోవచ్చు. కానీ ఆప్‎తో పోల్చుకుంటే కాంగ్రెస్‎ సంస్థాగతంగా అంతో ఇంతో ఇంకా బాలంగానే ఉంది. పేరున్న నేతలు కొద్దో గొప్పో ఇంకా ఆ పార్టీలో మిగిలే ఉన్నారు. కానీ, ఇది కాంగ్రెస్‎కి ప్రతిపక్ష పాత్ర కాపాడుకోవాడినికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ బలం బీజేపీ దూకుడుని ఆపుతుందా..? అంటే కష్టం అనే చెప్పాలి.

  ఇక, హిమాచల్ ప్రదేశ్ కథ కూడా ఇంచు మించు ఇలాగే ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పెద్ద పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదనే వినిపిస్తోంది. గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపితో పాటు ఎంఎల్ఏ సీట్లు గెల్చుకుని బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో బీజేపీ అధిష్టానం జైరామ్ ఠాకూర్‎ని మారుస్తుందనే వాదన కూడా వచ్చింది. కానీ, కమల దళం ఆ పని చేయలేదు. దీనికికారణం లేకపోలేదు. మొదట, కాంగ్రెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఇందాక చెప్పినట్టు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఆ ఊపుని కొనసాగించలేకపోయింది. రాష్ట్ర పార్టీలో అంతర్గత కలహాలు, కేంద్ర కాంగ్రెస్ రాష్ట్రాన్ని పట్టించుకొకపోవడంతో బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది.

  మరోపక్కన ఆప్ కూడా మొదట కొంత హడావిడి చేసింది. కేజ్రీవాల్‎కి ఖలిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారానికి తగట్టుగానే.. రాష్ట్ర అసెంబ్లీ‎ గోడపై ఖలిస్తాన్ జెండా ఎగరడం పెద్ద దూమరనికి దారి తీసింది. కానీ, క్రమంగా ఇది పల్చబడిపోయింది. మరోపక్కన కేజ్రీవాల్ కూడా రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేయడంతో బీజేపీ మళ్ళీ గెలిచే అవకాశాలే ఎక్కువని, కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితం అవతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

  జైరామ్ ఠాకూర్ విషయానికి వస్తే.. ఒక వ్యక్తిగా మంచి పేరున్న.. సమర్ధవంతమైన ముఖ్యమంత్రి అనిపించుకోవడంలో కొంచెం తడబడుతున్నాడానే చెప్పాలి. కానీ, మోదీ గాలి రాష్ట్రంలో బలంగా ఉండడం బీజేపీకి పెద్ద అనుకూలత అని అనవచ్చు. దీనిని అవకాశంగా మలుచుకునే మోదీ హిమాచల్ ప్రదేశ్‎లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒక పక్కన దిగుమతిని తగ్గించి.. దేశాన్ని అత్మనిర్భర్ చేసే భారీ డ్రగ్ పార్క్ ప్రారంభించడంతో పాటు.. మరో పక్కన ప్రతిష్టాత్మక వందే భారత్ రైలును ప్రారంభించి జనం దృష్టిని కమలం వైపే ఉంచుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‎ని పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు భారీగా ప్రణాళికలు చేయడమే కాకుండా దానికి అనుగుణంగా పనులు పర్యాటకులను ఆకర్షించడానికి.. రోప్ వే వంటి పనులు కూడా మొదలుపెట్టారు. ప్రతిపక్షాలు పోటీ ఇచ్చే స్థితిలో లేకపోవడాన్ని అవకాశంగా మలుచుకుని అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అస్త్రాలుగా ప్రచార రంగంలోకి దిగిన బీజేపీ.. మళ్ళీ గెలిచి ఉత్తరాఖండ్ మాదిరిగానే ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ అనే సంస్కృతికి స్వస్తి చెప్తుందని విశ్లేషకులు అంటున్నారు.

  ఇప్పటివరకు వస్తున్న విశ్లేషణ, అంచనాల బట్టి రెండు రాష్ట్రాలలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితావుతుందనే వాదన వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఆప్ ప్రభావం చూపలేక ఘోర అవమానం పాలవ్వడం తప్పదని అంటున్నారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్‎కి గండి కొట్టి.. మోదీపై, ఆయన తల్లిపై పరుష పదజాలం వాడటమే కాకుండా,.. హిందూ ధర్మాన్ని అవమానించినవారికి ప్రాముఖ్యత ఇచ్చి.. బీజేపీ గెలుపుకు కేజ్రీవాల్ పరోక్షంగా కారణం అవుతున్నారనే వాదనను తీసిపారేయలేం.

  అదే జరిగితే, కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ఆప్.. కేవలం ఢిల్లీ, పంజాబ్‎కే పరిమిత అవుతుంది. అంతేకాదు, కాంగ్రెసేతర విపక్షం కష్టమనే వాదన మరింత బాలపడే అవకాశమూ ఉంది. కానీ, ప్రస్తుతమున్న కాంగ్రెస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా..? అంటే కాదనే సమాధానమే వస్తుంది. ఇటువైపు మోదీ, అటువైపు ఎవరు అని ఎప్పటినుంచో బీజేపీ సంధిస్తున్న ప్రశ్నకు ఇంకా జవాబు దొరకాలేదనే చెప్పాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ మళ్ళీ 2024లో గెలవడానికి మార్గం మరింత సుగమమైనట్టే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  Trending Stories

  Related Stories