నందిగ్రామ్ సాక్షిగా తుది ప్రచార హోరు

0
725

బెంగాల్ అసెంబ్లీ… రెండో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. రెండో దశలో 30 నియోజకవర్గాలకు ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ దశలోనే  తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అలాగే బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి తలపడుతున్న నందిగ్రామ్ నియోజకవర్గం నియోజవర్గంలో పోలింగ్ జరగనుంది . మార్చి 30వ తేదీన రెండో దశ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో…, అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇంకా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించాయి.

ఎలాగైనా సరే నందిగ్రామ్ లో తాను గెలిచి తీరాలనే తలంపుతో ఉన్న మమతా బెనర్జీ నందిగ్రామ్ లోనే మకాం వేశారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు ఇకపై నందిగ్రామే తన సొంత నియోజకవర్గమని ప్రజల్లో స్థానిక సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేశారు.ఇక.. తాను మరో నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేయనని, నా సోదరులకు, మాతృమూర్తులకు, కృతజ్ఞతలు తెలియజెప్పేందుకే తాను నందిగ్రామ్ నియోజకవర్గానికి వచ్చానని, ఇక్కడ నుంచే పోటీకి దిగానని చెప్పుకొచ్చారు. అలాగే తాను అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్ పోరాటానికి సైతం తాను సెల్యూట్ చేస్తున్నానని, నందిగ్రామ్ ఇక తనకు సొంత ప్రాంతం అని, తాను ఇక్కడే ఉంటానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

అలాగే ద్రోహులకు తగిన రీతిలో సమాధానం చెబుతామని పరోక్షంగా సుబేందు అధికారిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బీజేపీ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మమతా. పెద్దసంఖ్యలో స్థానికేతరులను నందిగ్రామ్ బీజేపీ రప్పించిందని, వారికి పోలీసులు దుస్తులు వేసి ప్రజలను భయాందోళనలకు గురిచేయిస్తోందని ఆమె ఆరోపించారు.

అఖరి రోజు ప్రచారం కావడంతో ర్యాలీల తర్వాత… దీదీ మూడు కి.మీ పాటు రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా తృణమూల్ కార్యకర్తలు జై హింద్, జై బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్ నినాదాలు చేశారు. నందిగ్రామ్ లో దీదీ గెలుపు కష్టమేనని సర్వేలు రావడంతో.., మమతా బెనర్జీ నందిగ్రామ్ లోనే తిష్టవేసి తన గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని.. విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు బీజేపీ కూడా తృణమూల్ కాంగ్రెస్ కు దీటుగా నందిగ్రామ్ లో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. కేంద్రహోంమంత్రి అమిత్ షా చివరి రోజు నందిగ్రామ్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. అమిత్ షా రోడ్ తో నందిగ్రామ్ పురవీధులు అన్ని కూడా కాషాయ జెండాలతో రెపరెపలాడాయి. జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి.

నందిగ్రామ్ లో సువేందు విజయంతో మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడాలని స్థానిక ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలుకుతున్న ప్రజలకు ఆయన శిరస్సు వంచి నమస్కారం చేశారు. అలాగే  బెంగాల్ అభివృద్ధి, ఉద్యోగ కల్పన, మెరుగైన విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు వంటి అన్నింటిలో మార్పు రావాలంటే మోదీ నేతృతంలో బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని షా నందిగ్రామ్ ప్రజలను కోరారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 4 =