ప్రధాని తల్లిపైనే అసభ్యకర వ్యాఖ్యలు చేశాడో ప్రబుద్ధుడు. వీక్షకులతో పంచుకోలేని విధంగా పరుష పదజాలాన్ని ఉపయోగించాడు. బీబీసీ ఆలిండియా రేడియో లైవ్ షోలో ఈ ఘటన జరిగింది. అతడి మాటల్ని యథాతథంగా ప్రేక్షకుల్లోకి వదలడంతో అది వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్లో బీబీసీని బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
యూకేలో సిక్కులు, భారతీయులపై జరుగుతున్న దాడులు, జాత్యాహంకారం అనే అంశంపై.. బీబీసీ ఆసియన్ నెట్ వర్క్ లో మార్చి 1న ఓ బిగ్ డిబేట్ జరిగింది. దాదాపు గంటా 53 నిమిషాల పాటు ఈ డిబేట్ కొనసాగింది. ఈ లైవ్ బ్రాడ్ కాస్ట్ లో వివిధ దేశాల నుంచి పలువరు వ్యక్తులు ఫోన్ కాల్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రియారాయ్ అనే యాంకర్ నిర్వహించిన ఈ డిబేట్ లో భారత్ నుంచి పంజాబ్ కు చెందిన ‘సిమోన్’ అనే కాలర్.. లైవ్ లోకి వచ్చాడు. వచ్చీరాగానే చర్చను తప్పుదోవ పట్టించాడు. దీంతో చర్చ కాస్తా భారత్ లో జరుగుతున్న రైతుల నిరసనల వైపు మళ్లింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తనకు ఉన్న అక్కసును వెళ్లగక్కాడు. అదే సమయంలో ప్రధాని మోదీ తల్లిపై అసభ్యకరంగా నీచమైన వ్యాఖ్యలను చేశాడు. రాయలేని పదాలను వాడి దూషణలకు దిగాడు.
ఈ వ్యాఖ్యలను బీబీసీ డిలీట్ చేయకుండా అలాగే ప్రేక్షకుల్లోకి వదిలింది. అది కాస్తా వివాదంగా మారింది. ఇంటర్నెట్ లో బీబీసీపై పెద్ద ఉద్యమమే మొదలైంది. భారత్ లో బీబీసీని నిషేధించాలనే డిమాండ్ ఊపందుకుంది. బీబీసీ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. యాంకర్ ప్రియా రాయ్ నిస్సహాయతను ప్రశ్నిస్తూ, ఈ ఘటనపై బ్రిటన్ టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ‘ఆఫ్ కామ్’ జోక్యం చేసుకోవాలని, సదరు రేడియో ఛానల్ లైసెన్సులను రద్దు చేయాలని భారత సంతతి సంఘాలు, వ్యక్తులు డిమాండ్ చేస్తున్నాయి.
అటు దూషణలకు దిగిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ దేశ ప్రధాని తల్లిని దూషిస్తే, వాటిపై విచారణ వ్యక్తం చేయకపోవడం దారుణమని పోస్టులు పెడుతున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఘటనను ఖండిస్తున్నారు. దీంతో దిగివచ్చిన బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం సీమోన్ అసభ్యవ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పింది. 3 గంటల కార్యక్రమాన్ని 1.32గంటలకు ఎడిట్ చేసి, అందులో యాంకర్ ప్రియా రాయ్ క్షమాపణలను కూడా జతచేసింది.