More

    మమత ప్రభుత్వంపై కలకత్తా కోర్టు మండిపాటు

    పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికల అనంతరం దారుణమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హిందువులపై వరుసగా దాడులు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు.. భారతీయ జనతా పార్టీ మద్దతు దారులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. కొందరు ఏకంగా రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే చోటు చేసుకుందన్నది జగమెరిగిన సత్యం. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదంతా పట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఓ వైపు గవర్నర్ ఈ ఘటనలపై స్పందించాలని కోరుతున్నా కూడా మమతా వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఎంతో మంది నిపుణులు చెప్పుకొచ్చారు. హిందువులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు.. ఇలా ఎన్నో దారుణాలు మమతా బెనర్జీ పార్టీ గెలవగానే పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనలను ఎంతో మంది తప్పుబట్టారు.

    ఈ హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోల్ అనంతర హింసపై చర్యలు తీసుకోవాలంటూ.. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాసిన నాలుగు రోజుల తరువాత కలకత్తా హైకోర్టు శనివారం నాడు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శించింది. పోల్ అనంతర హింసకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి రాష్ట్రం ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోలేదని.. హింస చెలరేగినప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపైనా, ఫిర్యాదులు వ‌చ్చినా కేసులు నమోదు చేయక‌పోవ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హింసాకాండపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కోరింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని, రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంద‌ని కలకత్తా హైకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

    ఎన్నికల అనంతరం హింస కారణంగా రాష్ట్ర వాసుల జీవితాలు ప్రమాదంలో ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తనకు నచ్చిన విధంగా ప్రవర్తించింది. ఫిర్యాదులకు తక్షణ చర్యలు తీసుకోలేదు.. శాంతిభద్రతలు పాటించడం, రాష్ట్రవాసుల ప్రాణాలు కాపాడడం ముఖ్యమైన అంశమని కలకత్తా హైకోర్టు అభిప్రాయ పడింది. రాష్ట్ర ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం ముప్పును ఎదుర్కొంటుండటాన్ని తీవ్రంగా పరిగణించాలని.. బెంగాల్‌ను తనకు నచ్చిన దారిలో వెళ్లడానికి అనుమతించరాదని తెలిపింది. కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్య‌త ప్రభుత్వానికి ఉందని గుర్తుచేసింది.

    ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే కమిటీకి అవసరమైన సదుపాయాలు కల్పించాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ కమిటీకి ఏమైనా అడ్డంకులు సృష్టిస్తే కోర్టు ధిక్కారం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రికలు జారీ చేసింది. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కొనసాగించడం, ప్రజల్లో విశ్వాసాన్ని ప్రేరేపించడం విధి అని గుర్తు చేశారు. బెంచ్ లో న్యాయమూర్తులు ఐ.పి.ముఖర్జీ, హరీష్ టాండన్, సౌమెన్ సేన్, సుబ్రతా తాలూక్దార్ ఉన్నారు. నిరాశ్రయులైన వారిని ఇళ్లకు తిరిగి రాకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫిర్యాదులను పరిశీలించి వారి పునరావాసం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవల అథారిటీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 30కు వాయిదా వేశారు.

    Trending Stories

    Related Stories