ఏపీ ఆర్థిక పరిస్థితి, వనరుల నిర్వహణపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయని వెల్లడించింది. చట్ట సభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీనపర్చారని కాగ్ విమర్శించింది. అసెంబ్లీ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునావృతం అయ్యాయని తెలిపింది. 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయని తెలిపింది. కొత్త సంక్షేమ పథకాలతో 6.93 శాతం రెవెన్యూ ఖర్చులు పెరిగాయని వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు 2019-20వ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గినట్టు కాగ్ నిర్ధారించింది. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన నివేదికను శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టింది. కాగ్ చేసిన నిర్ధారణ ప్రకారం కేంద్ర పన్నుల వాటా గత ఏడాదితో పోలిస్తే 4,545 కోట్ల రూపాయలు (13.86శాతం)తగ్గాయి. 2015-16 నుండి 2018-19 వరకు ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చిన కేంద్ర నిధులు 2019-20 ఆర్థిక సంవత్సరంలో తగ్గాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 21,894 కోట్ల రూపాయలు కేంద్రం నుండి పన్నుల వాటాగా రాగా.. 2018-19 సంవత్సరానికి ఆ మొత్తం 32,787 కోట్లకు చేరింది. 2019-20లో ఆ మొత్తం 28,242 కోట్ల రూపాయలకు తగ్గింది.
2018-19లో 58,031 కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర సొంత వనరుల ఆదాయం 2019-20లో 57,601 కోట్లకు తగ్గింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రెవెన్యూ ఖర్చు గణనీయంగా పెరిగింది. పెరిగిన రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని కాగ్ విమర్శించింది. రుణ నిధులతో ఆస్తుల ఏర్పాటు చేయకపోవడం వల్ల రానున్న సంవత్సరాలకు రుణ భారం పెంచినట్టవుతుందని వ్యాఖ్యానించింది. రుణాల్లో 80 శాతం రెవెన్యూ పద్దుల్లోని లోటు భర్తీకే వాడుకుంటున్నారని, అందుకే ఆస్తుల కల్పన జరగడం లేదని పేర్కొంది. పలు సంస్థల నిధులను పిడి ఖాతాల్లోకి మళ్లించడం కూడా సరికాదని తెలిపింది. ఇక 2019-20 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన ఖర్చులను 2020 జూన్‌లో శాసనసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. బడ్జెట్టులో లేకుండా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 26,097 కోట్ల రూపాయల రుణానికి గ్యారంటీలు ఇచ్చారని, నేరుగా ఈ రుణాలతో ప్రభుత్వానికి సంబంధం లేకపోవడం వల్ల వాటి ప్రభావాన్ని ద్రవ్యలోటులో చూపించడం లేదని, అందుకే ద్రవ్యలోటు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని స్పష్టం చేసింది. సంక్షేమ పథకాల కారణంగా రెవెన్యూ లోటు కూడా గతేడాది కన్నా 90 శాతం పెరిగినట్లు పేర్కొంది. 2019-20కి 90.24 శాతం రెవెన్యూ లోటు పెరిగిందని కాగ్ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 32,373 కోట్ల మేర బకాయిల చెల్లింపులు పెరిగాయని పేర్కొంది. చెల్లించాల్సిన బకాయిల వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదని తెలిపింది.