పగటి కలలకు ఖర్చు ఉండదంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

0
866

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో ప్ర‌జా సంగ్రామ యాత్రకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజ‌రు కాన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభను ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలో కనీవినీ ఎగరని రీతిలో నిర్వహించనున్నట్లు బీజేపీ ప్లాన్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొంటున్న ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, బీజేపీ కార్యకర్తలు హాజరవ్వనున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఏర్పాట్లు, జనసమీకరణ అంశాలపై ఇప్పటికే పలువురు నాయకులతో చర్చించారు.

సభ నేప‌థ్యంలో అక్క‌డ‌ ఏర్పాట్ల‌ను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప‌రిశీలించి మీడియాతో మాట్లాడారు. బీజేపీపై తెలంగాణ‌ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విష ప్ర‌చారం చేస్తున్నార‌ని విమర్శించారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో తాము రైతుల‌కు వాస్త‌వ ప‌రిస్థితులు తెలియ‌జేస్తున్నామ‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవాలన్న దృక్ప‌థంతో కేంద్ర ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని చెప్పారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాల‌ను తెర‌వ‌లేద‌ని చెప్పారు. ఇప్ప‌టికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎఫ్‌సీఐకి త‌ర‌లించాల‌ని ఆయ‌న అన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యాన్ని సేక‌రించేందుకు అన్ని ర‌కాలుగా ఏర్పాట్లు చేసుకుంద‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంత‌కు ముందు ధాన్యాన్ని కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో వ‌ర్షాల‌కు ధాన్యం త‌డిసి, వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుని పోయింద‌ని అన్నారు. దీంతో రైతులు న‌ష్ట‌పోయార‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ జెండా ఎగురుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణను పూర్తి గా అభివృద్ధి చేసేశామని.. ఇక దేశాన్ని ఉద్దరించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, పగటి కలలకు ఖర్చు ఉండదని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనపై తీవ్ర వ్యతిరేఖత ఉందని, హుజూరాబాద్ , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని విమర్శించారు. రేపటి సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు.