ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆదివారం కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అనే పదంలో ‘సి’ అంటే కన్నింగ్ (మోసపూరితమైంది) అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. బీఎస్పీ పదంలో ‘బీ’ అంటే భారతతీయ జనతా పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శను తిప్పికొడుతూ మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల మధ్య ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీకి బీఎస్పీ బీటీమ్ అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసని, ఇప్పటికైనా మాయావతి నిజాలను ఒప్పుకోవాలని యూపీ కాంగ్రెస్ నేత అశోక్ సింగ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో ” సి “అంటే ” మోసపూరిత “పార్టీ అని బీఎస్పీ అధినేత్రి వరుస ట్వీట్లలో యుపి కాంగ్రెస్ హ్యాండిల్ కు రిప్లై ఇచ్చారు. బీజేపీతో మాయావతి రహస్య ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.కాంగ్రెస్‌కు యూపీలో అడ్రస్ లేదని, కాంగ్రెస్ విమర్శలు అభ్యంతర కరమని అన్నారు. బీఎస్పీలో బీ అంటే బహుజనులని.. కాంగ్రెస్‌లో సీ అంటేనే కన్నింగ్ అని విమర్శించారు. బహుజనుల ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనంతరం వారిని వదిలేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. “ఉత్తర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ఆక్సిజన్ మీద నడుస్తోంది” అని ఆమె అన్నారు. బీఎస్పీ యొక్క ‘బి’ అంటే ‘బహుజన్’, దీనిలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబిసిలు, మతపరమైన మైనారిటీలు మరియు ఇతర అట్టడుగు వర్గాలు కలిసి పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల వారిని బహుజనులు అని పిలుస్తారని ఆమె వివరించారు.
కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో “బహుజన్ల ఓట్లతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ” కాంగ్రెస్ బహుజన్లను “నిస్సహాయంగా మరియు బానిసల వలె” ఉంచిందని అన్నారు. అలాంటి సమయంలోనే బీఎస్పీ ఆవిర్భవించింది. ఆ సమయంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో లేదని ఆమె అన్నారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ, బీజేపీ ప్రభుత్వాల కింద చిన్న, పెద్ద ఎన్నికలు ఎప్పుడూ స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదని కూడా అందరికీ తెలుసునని మాయావతి విమర్శించారు.