భాగ్యలక్ష్మి ఆలయానికి రానున్న యోగి ఆదిత్యనాథ్‌

0
810

హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. ఇక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమావేశాలకు హాజరవుతారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హాజరుకానున్నారు. హై సెక్యూరిటీ మధ్య ఆయన నేరుగా భాగ్యలక్ష్మి టెంపుల్ కు వస్తారని బీజేపీ వర్గాలు చెప్పాయి. భాగ్యలక్ష్మి ఆలయానికి రావాల్సిందిగా యోగి ఆదిత్యానాథ్ ను బీజేపీ నేతలు కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించడం ద్వారా హైదరాబాద్‌లో జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశం హాట్ టాపిక్ గా నిలపడానికి ప్రయత్నించాలని బీజేపీ భావిస్తోంది. ఈ ప్రాంతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ అడ్డాలో ఉంది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి అసదుద్దీన్ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చారు. “జూలై 2న ఆలయాన్ని సందర్శించాల్సిందిగా బీజేపీ తెలంగాణ యూనిట్ యోగి ఆదిత్యనాథ్ కు అభ్యర్థన పంపింది. మంగళవారం మాకు ఆయన ఆమోదం లభించింది” అని పార్టీలోని ఉన్నత వర్గాలు మీడియాకి తెలిపాయి.

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. యోగి భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించడం ద్వారా రాజకీయంగా మైలేజీని పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ టి రాజా సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ప్రకారం, ఆయన ప్రార్థనలు చేయడానికి ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. అయితే బహిరంగ సభలో ప్రసంగించరని తెలిపారు. ఆయన పర్యటన పాతబస్తీలోని పార్టీ క్యాడర్‌కు మనోధైర్యాన్ని నింపనుందని చెబుతున్నారు.