ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపుతప్పి జల్లేరు వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదసమయంలో బస్సులో 47 మంది ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. వాగుపై ఉన్న వంతెనను ఢీకొట్టి వాగులో పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే కొందరు ప్రయాణికులు కిటికీలోంచి బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులను పడవల సాయంతో స్థానికులు ఒడ్డుకు చేర్చారు. బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో జల్లేరు వాగు లో బోల్తా పడిపోయింది. బస్సు వాగులో ఒకవైపుకు పడడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

