More

    మానసిక ప్రశాంతత లేదని ఆలయంలో చోరీ సొమ్ము అప్పగింత..!

    మన మనసే మనకు పెద్ద కోర్టు. మనం చేసిన ప్రతి పనిని అది ఎత్తిచూపుతుంది. అందుకు ఉదాహరణగా తాజాగా ఒక సంఘటన జరిగింది. ఆలయ హూండీలో చోరీ చేసిన అజ్ఞాత వ్యక్తి, మళ్లీ చోరీచేసిన నగదుతో పాటు హూండీలో వేసిన లేఖలో ‘నన్ను క్షమించండి.. దేవుడు కూడా క్షమిస్తాడు’ అని రాసి ఉండడం ఆశ్చర్యం కలిగించింది.

    తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా లాలాపేట సమీపంలో కాంచనగిరి కొండ ఆలయంలో ఈనెల 17న రాత్రి ప్రవేశించిన వ్యక్తి హూండీ బద్దలుకొట్టి నగదు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి సిప్కాట్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో, హూండీలోని నగదును ఆలయ నిర్వాహకులు ఆ తర్వాత లెక్కించగా అందులో లభించిన లేఖలో… నన్ను క్షమించండి, నేను చిత్రా పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హూండీ పగులగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత లేకపోగా, కుటుంబంలోనూ సమస్యలు తలెత్తాయి. నేను హూండీలో చోరీచేసిన రూ.10 వేల నగదును మళ్లీ వేస్తున్నాను, నన్ను క్షమించండి, దేవుడు కూడా క్షమిస్తాడు’ అని రాసిన లేఖతో పాటు రూ.500 నోట్లతో కూడిన రూ.10 వేలు జతచేసి ఉంది.

    గత నెల ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తాము నేరం చేసిన తర్వాత తమకు పీడకలలు వస్తున్నాయంటూ కొంతమంది దొంగలు తాము దొంగిలించిన అష్టధాతు విగ్రహాలను తిరిగి పోలీసులకు అప్పగించారు. చిత్ర కూట్ తరౌన్హాలోని పురాతన బాలాజీ ఆలయంలో మే 9వ తేదీ రాత్రి కోట్ల విలువైన 16 అష్టధాతువుల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించిన ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంతలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ విగ్రహాలను దొంగలించిన దొంగలు.. తమకు అప్పటి నుంచి నిద్రపట్టడం లేదంటూ.. ఆ విలువైన విగ్రహాలను ఆలయ పూజారికి తిరిగి ఇచ్చారని పోలీసులు తెలిపారు.

    దీనికి సంబంధించి తాము గుర్తు తెలియని దొంగలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించబడిన 16 విగ్రహాలలో 14 మహంత్ రాంబాలక్ నివాసం సమీపంలో గోనె సంచిలో రహస్యంగా దొరికాయని చెప్పాడు. పూజారికి ఒక గోనె సంచి.. దీంతోపాటు ఒక లేఖ దొరికింది. ఆ ఉత్తరంలో దొంగలు తమకు రాత్రిపూట భయానక కలలు వస్తున్నాయని రాసినట్లు చెప్పారు. ఈ భయం కారణంగా తాము విగ్రహాలను తిరిగి ఇస్తున్నట్లు అందులో ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఇంకా రెండు విగ్రహాలు రావాల్సి ఉంది. మరి వాటిని తిరిగి ఇస్తారా? లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే లెటర్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

    spot_img

    Trending Stories

    Related Stories